సాక్షి పత్రిక విచిత్రమైన స్ట్రాటజీ: బిజెపి ని ఎగదోస్తోందెందుకని?

ఒక పక్క బడ్జెట్ లో ఎపి కి మొండిచెయ్యి చూపిన బిజెపి పై రాష్ట్రమంతా నిరసన వెల్లువెత్తింది. ఫేస్ బుక్ బిజెపి పేజీలో తెలుగు వాళ్ళంతా ఘోరమైన రివ్యూలిస్తుండటం తో బిజెపి “రివ్యూ” సెక్షన్ నే తీసేసింది. ఇక మీడియాముఖంగా అందరూ బిజెపి ని ఎండగడుతున్నారు. అయితే ఇంత జరుగుతుంటే, సాక్షి లో మాత్రం బిజెపికి వ్యతిరేకంగా కథనాలు రాకపోగా, బిజెపి పార్టీ ఎపి లో ఎదగలేక పోవడం పై సానుభూతి చూపిస్తూ కథనాలు రావడం సామాన్యుడికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉదాహరణకి సాక్షి జిల్లా ఎడిషన్లలో నిన్న వచ్చిన కథనాల్లో వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:

కృష్ణా జిల్లా:

  • సీఎం చంద్రబాబు బీజేపీ చేతితోనే ఆ పార్టీ కన్ను పొడిపిస్తున్నారు.
  • విజయవాడలో బీజేపీని బలోపేతం చేద్దామని వాదించి, చర్యలు చేపట్టి నగర పార్టీ అధ్యక్షుడు ఉమమహేశ్వర రాజుకు పరాభవమే మిగిలింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నుంచి సహకారం లభించకపోవడం గమనార్హం
  • నియోజకవర్గంలో మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారిని మంత్రి కామినేని పక్కనపెట్టేశారు. టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
  • భారతంలో శల్యుని మరిపించేలా మంత్రి కామినేని శ్రీనివాస్‌ జిల్లాలో బీజేపీ రథాన్ని నడుపుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా: :

  • శ్రీకాకుళంలోనే టీడీపీ ఆధిపత్యం బీజేపీపై స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం ఉండట్లేదు.
  • రాజాం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆధిపత్యంతో బీజేపీ కేడర్‌ చిత్తయింది.
  • పలాస నియోజకవర్గంలో బీజేపీ నాయకుల సిఫారసుతో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తులు వచ్చినా పక్కన పెట్టేస్తున్నారు.
  • పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది మొదలు బీజేపీని ఎదగనీయకుండా అడ్డుకుంది.
  • పొత్తుధర్మం అంటూనే టీడీపీ శ్రేణులు తమను తొక్కేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

విజయనగరం జిల్లా :

  • మిత్ర పక్షాలైన బీజేపీ, టీడీపీల మధ్య జిల్లాలో కనీస సఖ్యత లేదు.
  • అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు బీజేపీ నేతలకు కనీస ఆహ్వానం లేదు.
  • కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లకు చంద్రన్న బాట పేరుపెట్టి వాటి ప్రారంభోత్సవాలకు మిత్రపక్షానికి ఆహ్వానం అందించడం లేదు.
  • అసలు అధికార పక్షమో, మిత్రపక్షమో, ప్రతిపక్షమో తెలియని మీమాం సలో బీజేపీ వారంతా కొట్టుమిట్టాడుతున్నారు.
  • నిజానికి జిల్లాలో బీజేపీ నేతలెవరికీ టీడీపీతో పొత్తు ఏ మాత్రం ఇష్టం లేదు.
  • రాష్ట్రంలో పెత్తనం టీడీపీది… బానిసత్వం బీజేపీది అన్నచందంగా ఉంది పరిస్థితి

ఇవీ సాక్షి జిల్లా ఎడిషన్లలో వచ్చిన వ్యాఖ్యలు. ఇవి చదివిన వారెవరికైనా వచ్చే సందేహం ఒక్కటే. సాక్షి ఉద్దేశ్యం ఏంటి? సాక్షి బాధ దేనికి? బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందనే విషయం పై జగన్ స్పందించకపోగా, బిజెపి పార్టీ బలోపేతం అవ్వడం లేదని సాక్షి కి ఎందుకింత బాధ? అసలు దక్షిణ భారత రాష్ట్రాలు దేశం లోనే ఉన్నాయన్న స్పృహ కూడా లేనట్టు వ్యవహరిస్తున్న బిజెపి అధిష్టానానికి దక్షిణాది రాష్ట్రాల్లో బలపడే ఉద్దేశ్యముందా అసలు. ఒకవేళ అలాంటి ఉద్దేశ్యముంటే దక్షిణాది రాష్ట్ర ప్రజలని ఆకట్టుకునేలా వరాల జల్లు ప్రకటించి ఉండేది. అలా ప్రజల్లో మంచి ఇమేజ్ ని సంపాదించుకోవడం ద్వారా, పార్టీ కొద్దికొద్దిగా బలపడే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఎపి కి ఏ సాయమూ చేయట్లేదంటే వారికి ఇక్కడ బలపడే ఉద్దేశ్యమే లేనట్టు. మరి కంద కి లేని దురద కత్తిపీటకెందుకు. అసలు బిజెపి కి తెలుగు రాష్ట్రాలకి అలుసైపోవడానికి కారణం ఒకటే. చంద్రబాబు బయటికి వస్తే మద్దతివ్వడానికి జగన్ రెడీ గా ఉన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులని బూచిగా చూపి, ఇటు టిడిపి అటు వైసిపి, ఈ రెండు పార్టీలు కలిసి పంచుకునే 25 ఎంపీ సీట్లనీ ఎన్‌డీయే కి మద్దతు ఇప్పించేలా చేసుకునే శక్తి అమిత్ షా- మోడీ లకి ఉంది. కాదు కాదు ఆ శక్తి ని వాళ్ళకి మనవాళ్ళే ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పని చేయాలని ప్రజలు ఆశిస్తూంటే.. సాక్షి మనోగతం మాత్రం దీనికి భిన్నంగా ఉందనీ అందుకే బిజెపిని రాష్ట్రప్రభుత్వం పై ఎగదోయడానికి శాయశక్తులా కృషి చేస్తోందనీ ప్రజలకి సాస్ఖి వ్యాఖ్యలు చూసాక అనిపిస్తే, అది ప్రజల తప్పు ఎంతమాత్రమూ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.