వారు త‌ప్ప మిగ‌తా అంద‌రూ ఎల్లో మీడియా..!

గుర్తుపెట్ట‌ుకోండి… ఇక‌పై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహన్ రెడ్డిని విమ‌ర్శిస్తూ ఏ క‌థనం రాసినా, కేసుల గురించి ఊటంకించినా, ఒకవేళ ఏదైనా కేసులో ఆయన పేరు ఉన్నప్పటికీ దాన్ని ప్రస్థావించినా ఉచ్చరించినా, ఆయ‌న‌కు వ్య‌తిర‌కంగా ఎవ‌రు ఏది ప్ర‌సారం చేసినా వారిని ‘ఎల్లో మీడియా’ ప‌రిగ‌ణించ‌బ‌డును!

గుర్తుపెట్టుకోండి… ఈ సమయంలో.. అనగా, ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఈ సమయంలో, జ‌గ‌న్ గురించి రాసే ప్ర‌తీ నెగెటివ్ క‌థ‌నమూ ఆయ‌న సాగిస్తున్న ‘రాజీలేని పోరాటాన్ని’ చూసి ఓర్వ‌లేనిత‌నంగానూ చూపోర్చని గుణంగానూ ప‌రిగ‌ణించ‌బ‌డును..! ‘సాక్షి’ సూత్రీక‌ర‌ణ ఇలానే ఉంది.

నిన్నట్నుంచీ మీడియాలో మారిషస్ కేసు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆ దేశానికి చెందిన కంపెనీకీ ఇందుటెక్ కి మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ఇందుటెక్ అనుకున్న స‌మ‌యంలో ఆ కంపెనీ ప‌నులు ప్రారంభించ‌లేక‌పోయింద‌నీ, జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో ఇందుటెక్ ఇరుక్కోవ‌డంతో త‌మ‌కు న‌ష్టం క‌లిగిందంటూ దీనికి బాధ్య‌త వహించాలంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో స‌హా ప‌లువురు మంత్రులను ప్ర‌తివాదులుగా చేర్చుతూ మారిష‌స్ ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించింది. నిజానికి, ఈ క‌థ‌నం మొద‌టగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ‌చ్చింది. ఆ త‌రువాత‌, మిగ‌తా మీడియా సంస్థ‌లు కూడా ఈ వార్త‌ను ప్ర‌సారం చేశాయి. జ‌గ‌న్ పై ఉన్న ఛార్జ్ షీట్ ను ఈ కేసులో భాగంగా మారిష‌స్ ప్ర‌భుత్వం ప్ర‌స్థావించింది. అయితే, ఇదంతా ఎల్లో మీడియాలో సృష్టి, జ‌గ‌న్ ఎదుగుద‌ల చూసి ఓర్వ‌లేనిత‌నం అంటూ ‘సాక్షి’ ఓ క‌థ‌నం వండివార్చేసింది. వారి దృష్టిలో సాక్షి త‌ప్ప, ఎల్లో మీడియా కానిది ఏదైనా ఉందా అనేదే అనుమానం..? మారిష‌స్ ప్ర‌భుత్వం పెట్టిన కేసు గురించి ఎవరు రాసినా అది ఎల్లో మీడియా కిందే లెక్క‌..? మరీ ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు నాయుడుకి అనుకూల మీడియా అయిపోతుందా..?

ఈ క‌థ‌నంలో మ‌రో అంశం ఏంటంటే… ఈ కేసుతో జ‌గ‌న్ కి ఏంటి సంబంధం అంటూ వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. అరే, పుచ్చ‌కాయ‌ల దొంగ అంటే భుజాలు త‌డుముకోవ‌డం ఎందుకు..? మారిష‌స్‌ కేసులో ప్ర‌తివాదిగా జ‌గ‌న్ పేరును చేర్చ‌క‌పోయినా, ఆయ‌న‌పై ఉన్న ఛార్జ్ షీట్ ను ప్ర‌స్థావించారు. అందరు రాసిన వార్తల్లో సారాంశం అదే కదా. సరే, ఇందుటెక్ జోన్ కు సంబంధించిన ఛార్జ్ షీట్ ను ఇటీవ‌లే సీబీఐ కోర్టు స్వీక‌రించిన మాట వాస్త‌వ‌మా కాదా..? జ‌గ‌న్ పాటు విజ‌య‌సాయిరెడ్డి, ఇందు శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌, స‌బితా ఇంద్రారెడ్డి, బీపీ ఆచార్య‌ల‌కు న్యాయ‌స్థానం స‌మ‌న్లు పంపి, మార్చి 16న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించిందా లేదా..? మరి, ఇందుటెక్ కీ మారిష‌స్ కి మ‌ధ్య వివాదం త‌లెత్తితే జ‌గ‌న్ కి ఏంటి సంబంధం అంటే ఎలా..?

ఈ క‌థ‌నంలో గ‌మ‌నించాల్సిన మ‌రో అంశం… జ‌గ‌న్ కు ప్ర‌జాద‌ర‌ణ పెరిగిపోతుంద‌నే సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీసారీ ఎల్లో మీడియా ఇలాంటి క‌థ‌నాలే రాస్తుంద‌ని చెప్పారు! ఆయ‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఇలానే చేశారన్నారు. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న పోరాటానికి, చివ‌రికి ముఖ్య‌మంత్రి కూడా హోదాకు అనుకూలంగా మాట్లాడాల్సిన ప‌రిస్థితి జ‌గ‌న్ తీసుకొచ్చార‌ట‌. కాబ‌ట్టి, దీన్ని ఓర్వ‌లేక ఎల్లో మీడియా జ‌గ‌న్ పై ఇలాంటి త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తోంద‌ట‌. సంతోషం ఏంటంటే… జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌త్యేక‌హోదా పోరాటాన్ని చూసి, ఓర్వ‌లేని మారిష‌స్ ప్ర‌భుత్వం ఈ సంద‌ర్బంలో కేసు పెట్టింద‌ని అన‌లేదు..! ప్రధాని మోడీతో జగన్ కు ఇటీవల పెరుగుతున్న సాన్నిహిత్యం చూసి, చిచ్చుపెట్టే ప్రయత్నం ఇది అని అభివర్ణించలేదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.