వైఎస్ అభివృద్ధి చేస్తే జగన్‌కు ఎందుకు చాన్సివ్వాలి..?

YS-jagan

“మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండ”నే సామెత ఒకటి ఉంది. అది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో కానీ.. ఆయన అదే సామెతను పదే పదే వేరే వేరే ఆర్థాల్లో చెప్పుకొస్తున్నారు. విశాఖ కంచరపాలెంలో.. ఆయన ప్రసంగంలో .. విశాఖకు.. వైఎస్ ఎంతో చేశాడని చెప్పుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. పదిహేనేళ్ల కిందట..అధికారం చేపట్టి.. ఆ తరవాత ఐదేళ్లలో వేసిన రోడ్లే విశాఖలో ఇప్పటికీ ఉన్నాయట. అంతకు ముందు కానీ.. ఆ తర్వాత కానీ.. విశాఖలో రోడ్లే వేయలేదన్నది జగన్ వాదన. ఇదొక్కటే కాదు.. జగన్ ప్రసంగం అసాంతం వింటే.. స్టీల్ ప్లాంట్ లాభాల దగ్గర్నుంచి.. పోర్టు అభివృద్ధి మొత్తం వైఎస్‌ హయాంలోనే జరిగింది. ఎప్పుడైతే.. వైఎస్ మరణించారో.. ఆ క్షణం నుంచే.. ఇంకా తీవ్రంగా చెప్పుకోవాలంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విశాఖలో ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది… అంతే..!

ఇంకా విశేషం ఏమింటే.. కేంద్రం ఇవ్వాల్సిన రైల్వైజోన్, గిరిజన యూనివర్సిటీ సహా అనేక కేంద్ర ప్రాజెక్టుల విషయంపై చంద్రబాబునే నిందించారు. కేంద్రాన్ని కానీ.. నరేంద్రమోడీని కానీ.. ఎందుకివ్వలేదని… ప్రశ్నించలేదు. ఇప్పుడే ఎప్పటి నుండో ప్రశ్నించడం లేదు… అది వేరే విషయం. వైఎస్ హయాంలో విశాఖకు ఐటీవచ్చిందట, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చిందట, బీఆర్‌టీఎస్‌ రోడ్లు, కంచరపాలెం నుంచి పెందుర్తి వరకు రోడ్డును కూడా నిర్మించారు. వైఎస్ హయాం విశాఖలో కేవలం కిలోమీటర్ రోడ్డును మాత్రమే పూర్తి చేయలేదట. అది ఇప్పటికీ పూర్తి కాలేదట. వైఎస్‌కు క్రెడిట్ ఇచ్చే విషయంలో విశాఖ ఉక్కును.. అందులో పని చేసే కార్మికుల కష్టాన్ని కూడా పరిగణనలోకితీసుకోలేదు. విశాఖ ఉక్కు రెట్టింపు ఉత్పత్తి చేస్తోందంటే..దానికి వైఎస్ కారణమట. విశాఖ ఎయిర్‌పోర్టును కూడా వైఎస్సే కాపాడారట. వంద కోట్లతో టర్మినల్‌ నిర్మించి.. ప్రస్తుత ఎయిర్‌ పోర్ట్‌ను అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దిందికూడా వైఎస్‌సేనట. విశాఖలో జనం.. జీవించింది వైఎస్ హయాంలోనేనన్నట్లుగా జగన్ ప్రసంగం సాగింది. అంతేనా.. ఇప్పుడు వైజాగ్‌లో జరిగే ప్రతి తప్పు .. చంద్రబాబు చలువేనట. విశాఖ మొత్తాన్ని బినామీలుకు ఇచ్చేశారని ఆరోపించారు. విశాఖ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని.. కొత్త కొత్త కంపెనీలు.. ప్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు వస్తున్నాయని.. విశాఖ రాత మారుతోందని యువత భావిస్తోంటే.. జగన్ మాత్రం.. ఐటీలో అసలు అభివృద్ధి లేదని తేల్చారు. వైఎస్ హయాంలోనే విశాఖలో ఐటీ అభివృద్ధి చెందింట. కానీ ఇప్పుడు పడిపోయిందట.

జగన్ మోహన్ ప్రసంగం మొత్తం..తన తండ్రిగొప్పగా చేశారని చెప్పుకున్నా.. చంద్రబాబు ఏమీ చేయలేకపోతున్నారని తీర్పిచ్చారు. కానీ..తనకు ఎందుకు ఓటేయాలో మాత్రం చెప్పుకోలేకపోయారు. తన తండ్రి మంచి పనులు చేశాడంటే.. తనకు ఎందుకు ఓటేయాలో… వివరించలేకపోయారు. వారసుడ్ని కాబట్టి గెలిపించమని కోరుతున్నారు. కానీ ఆస్తులకు వారసులుంటారు కానీ.. ఓట్లకు ఉంటారా..? విశాఖ నగరంపై ప్రత్యేక దృష్టిపెట్టిన విజయసాయిరెడ్డి.. ఆదివారం పూటే.. విశాఖలోకి పాదయాత్ర ఎంటరయ్యేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. దాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి.. ప్రసారం చేసుకుని సంబరపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com