అన్న ముఖ్య‌మంత్రి, ఓట్లు, నోట్లు… ఇదే స‌మ‌ర శంఖారావం!

ప్రతిపక్ష నేత జ‌గ‌న్మోహన్ రెడ్డి పాద‌యాత్ర త‌రువాత పార్టీ యాత్ర ఎటువైపు అనే సందిగ్ధం వైకాపాలో కొట్టొచ్చిన‌ట్టు కనిపిస్తోంది. చారిత్రకం అనుకుని చేసిన ఆ యాత్ర త‌రువాత‌… రాజ‌కీయంగా దానకంటూ స‌రైన కొన‌సాగింపును వెతుక్కోవ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాలు ప‌క్కాగా క‌నిపించ‌డం లేదు. తాజాగా ఆయ‌న స‌మ‌ర శంఖారావ స‌భ‌లంటూ మొద‌లుపెట్టారు. సోమ‌వారం నాడు అనంత‌పురంలో ఒక స‌భ జ‌రిగింది. మున్ముందు అన్ని జిల్లాల్లోనూ ఈ స‌భ‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగిస్తారంటున్నారు. అయితే, ఈ స‌భ‌ల్లో పాద‌యాత్ర ఊపు కొన‌సాగింపు క‌నిపించ‌డమే లేదు! అంతేకాదు, ఈ స‌భ‌ల్లో జ‌గ‌న్ మాట్లాడుతున్న అంశాలు కూడా రెండ్రోజుల‌కే రొటీన్ అనే భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లిగే విధంగా ఉన్నాయి.

‘అన్న ముఖ్య‌మంత్రి అవుతాడు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఇళ్ల‌కి తీసుకొస్తాడు, చంద్ర‌బాబు ఇచ్చిన‌వాటికంటే ఎక్కువ ఇస్తాడు. చంద్ర‌బాబు ఇస్తున్న‌వి న‌మ్మొద్దు’… వ‌రుసగా జ‌రిగిన శంఖారావ స‌భ‌ల్లో ఇదే అంశాన్ని జ‌గ‌న్ ప్ర‌స్థావిస్తున్నారు. ఇంకోటి… ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు! మ‌న‌వాళ్ల ఓట్ల‌ను తొల‌గిస్తున్నారు, గ‌త ఎన్నిక‌ల్లో మ‌న‌కూ టీడీపీకి కేవ‌లం 5 ల‌క్ష‌ల ఓట్లు మాత్ర‌మే తేడా, ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలంటున్నారు. ఇంకోటి… మీడియా గురించి! మ‌నం పోరాటం చేస్తున్న‌ది కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు మీద మాత్ర‌మే కాద‌నీ, ఎల్లో మీడియా మీద అంటారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిల‌తోపాటు కొన్ని ఛానెల్స్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు! ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చాక నోట్ల క‌ట్ట‌ల‌తో చంద్ర‌బాబు వ‌స్తార‌నీ, ఆయ‌న్ని న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. గ‌త స‌భ తీసుకున్నా, తాజా అనంత‌పురం స‌భ‌లోనైనా… జ‌గ‌న్ రిపీట్ గా మాట్లాడుతున్న అంశాలు ఇవి. అంటే, ఇక మున్ముందు రాష్ట్రవ్యాప్తంగా జ‌రిగే శంఖారావ స‌భ‌ల‌న్నీ దాదాపుగా ఇలానే జ‌గ‌న్ ప్ర‌సంగాలుండే అవ‌కాశం క‌నిపిస్తోంది.

నిజానికి, పాద‌యాత్ర స‌మ‌యంలో కూడా ప్ర‌సంగాల విష‌యంలో ఇలానే ఒక రొటీన్ ఫార్ములాతో ముందుకెళ్లారు. ప్ర‌భుత్వంపై కొన్ని విమ‌ర్శ‌లు, ఇసుక నుంచి మ‌ట్టి దాకా… అంటూ ఒక ఫార్ములా పాఠాలే వినిపించారు. ఇప్పుడు కూడా అలాంటి ఫార్ములానే మ‌ళ్లీ క‌నిపిస్తోంది. చివరికి ‘అన్న ముఖ్య‌మంత్రి అవుతున్నాడు’ అని ఆయ‌నే చెప్పుకుంటున్నారు! పాద‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కొంత ప్ర‌స్థావ‌న ఉండేది. కానీ, ఇప్పుడీ స‌భ‌ల్లో ఆ అంశం ద్వితీయ ప్రాధాన్యం అన్న‌ట్టుగా మారిపోయింది. దీన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు అనేది వైకాపా వ్యూహ‌క‌ర్త‌లు ప‌రిశీల‌న చేసుకుంటున్నారో లేదో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com