రాజకీయాల్లో కర్మ అనేది చాలా వేగంగా చుట్టుముడుతుంది అనడానికి ఏపీ ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నామినేషన్లను అడ్డుకుని, భౌతిక దాడులు చేసి, విపక్షాలకు కనీసం పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవాలతో విజయకేతనం ఎగురవేసిన జగన్ రెడ్డికి.. ఇప్పుడు అదే భయం పట్టుకుంది. ఒక్క చోట కూడా ఏకగ్రీవం కానివ్వద్దు.. అందరూ పోటీ చేయాలి అంటూ ఆయన ఇస్తున్న పిలుపు కార్యకర్తల్లో ఉత్సాహం కంటే ఎక్కువగా భయం నింపుతోంది.
అధికార పక్షం రివేంజ్.. వైసీపీ క్యాడర్ ఆందోళన
గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఇబ్బందులు పడ్డ టీడీపీ, జనసేన శ్రేణులు ఇప్పుడు పక్కా స్కెచ్‌తో ఉన్నాయి. గతంలో తాము పడ్డ కష్టాలను వడ్డీతో సహా తీర్చుకోవాలని క్షేత్రస్థాయిలో కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఈ విషయం వైసీపీ నేతలకు, కార్యకర్తలకు బాగా తెలుసు. అధికార పక్షంతో నేరుగా ఢీకొంటే ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, వ్యక్తిగత రక్షణ కూడా ఉండదని వారు భావిస్తున్నారు. జగన్ రెడ్డి ఈగో కోసం తమ రాజకీయ భవిష్యత్తును, కుటుంబాలను పణంగా పెట్టేందుకు క్షేత్రస్థాయి నేతలు ససేమిరా అంటున్నారు.
సహాయం లేని ‘సాక్షి ఒత్తిళ్లు
పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లినా, కేసులు ఎదుర్కొన్నా హైకమాండ్ నుంచి రూపాయి ఆర్థిక సాయం అందదనే నమ్మకం ఇప్పటికే క్యాడర్లో బలంగా నాటుకుపోయింది. దీనికి తోడు, స్థానిక ఎన్నికల సమయంలో సాక్షి పత్రికకు ప్రకటనలు ఇవ్వాలని, పెయిడ్ ఆర్టికల్స్ రాయించాలని క్షేత్రస్థాయి నేతలపై ఒత్తిడి తీసుకురావడం రివాజుగా మారింది. సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా, మళ్లీ సాక్షి కి నిధులు ఇవ్వడం తమవల్ల కాదని నియోజకవర్గ ఇన్ఛార్జ్లు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు.
పులివెందులలోనే దిక్కులేదు.. రాష్ట్రంలో ఎక్కడ?
వైసీపీకి కంచుకోట లాంటి పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో వైసీపీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. సొంత గడ్డపైనే క్యాడర్‌ను కాపాడుకోలేకపోయిన జగన్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్న సెటైర్లు పడుతున్నాయి. పార్టీ నుంచి కనీస భరోసా లేని పరిస్థితుల్లో, ఇతర పార్టీల్లో చేరడం లేదా రాజకీయాలకు దూరంగా సైలెంట్ గా ఉండటమే మేలని మెజారిటీ నాయకులు భావిస్తున్నారు.
కార్యకర్తలకు నమ్మకం కలిగించలేని జగన్
ఓటములకు ఎదురొడ్డి పోరాడే ధైర్యం కార్యకర్తలకు ఉండాలి అంటే, నాయకుడిపై నమ్మకం ఉండాలి. కానీ, జగన్ రెడ్డి తీరు చూస్తుంటే కార్యకర్తలను కేవలం ఎన్నికల యుద్ధంలో వాడి పారేసే ఆయుధాలుగా మాత్రమే చూస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా, సామాజికంగా తమను తాము నాశనం చేసుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా లేరు. జగన్ రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే, స్థానిక ఎన్నికల నాటికి వైసీపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.
