ఇచ్ఛాపురం వ‌ర‌కూ స‌రిప‌డా కంటెంట్ ఇదేనా..?

ఇడుపుల‌పాయ‌లో మొద‌లుపెట్టి, ఇచ్ఛాపురం వ‌ర‌కూ ఆర్నెల్ల‌పాటు పాద‌యాత్ర చేస్తాన‌ని జ‌గ‌న్‌ మొద‌లుపెట్టి, నడుస్తున్న సంగతి తెలిసిందే. దాన్లో తొలి నెల పూర్త‌యింది. ఓ ప్ర‌త్యేక బృందం జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై ఏరోజుకు ఆరోజు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ స‌మాచారం ఏంట‌నేది మాత్రం జ‌గ‌న్ కీ, ఆయ‌న సతీమ‌ణి మాత్ర‌మే ఆ టీమ్ ఇస్తోంద‌న్న క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఆ స‌మాచారం ఆధారంగా పాద‌యాత్ర వ్యూహాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులూ చేర్పులూ ఉంటాయ‌నీ అన్నారు. అయితే, దాని ప్ర‌కారం జ‌గ‌న్ పాద‌యాత్ర తీరులోగానీ, ఆయ‌న ప్ర‌సంగాల కంటెంట్ లో గానీ మార్పులూ చేర్పులూ జ‌రిగాయ‌న్న‌ దాఖ‌లాలే క‌నిపించ‌డం లేదు. పాద‌యాత్ర‌లో అత్యంత ముఖ్య‌మైన‌వి ప్ర‌సంగాలే క‌దా! ఆ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ అవ‌స‌రం అనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి! ఎందుకంటే, గ‌డ‌చిన నెల‌రోజులుగా చెప్పిన విష‌యాల‌నే జ‌గ‌న్ మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతూ వ‌స్తున్నారు. స‌రే, మాట్లాడే అంశాల్లో స్థూలంగా పెద్ద మార్పు అనేది సాధ్యం కాక‌పోయినా… కనీసం దాన్ని ప్రెజెంట్ చేసే విధానం కూడా జ‌గ‌న్ మార్చ‌డం లేదనేది కొంద‌రి అభిప్రాయం.

అవినీతి గురించి మాట్లాడిన ప్ర‌తీసారీ… మ‌ట్టి నుంచి ఇసుక దాకా, ఇసుక నుంచి కాంట్రాక్ట‌రు దాకా, కాంట్రాక్ట‌రు నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి అమ‌రావ‌తి భూములు దాకా, అమ‌రావ‌తి భూముల నుంచి గుడి భూములు దాకా.. ఎక్క‌డ చూసినా అవినీతే అంటారు! జ‌న్మ‌భూమి క‌మిటీల గురించి ప్ర‌స్థావించిన ప్ర‌తీసారీ.. గ్రామాల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో మాఫియాలు తెచ్చార‌నీ, పెన్ష‌న్లు కావాల‌న్నీ లంచాలు ఇవ్వాల‌నీ, ఆఖ‌రికి మ‌రుగుదొడ్లు కావాల‌న్నా లంచాలు ఇవ్వాల‌ని అంటారు. చంద్ర‌బాబు హామీపై మాట్లాడిన ప్ర‌తీసారీ… ‘ఈ మ‌నిషిని ఇలా వ‌దిలేస్తే… రేప్పొద్దున మీ ముందుకొచ్చి కిలో బంగారం ఇస్తానంటాడు, మారుతీ కారు కూడా ఇస్తానంటాడు, మీరు న‌మ్ముతారా?’ అని జ‌గ‌న్ అంటారు . ఇళ్ల గురించి మాట్లాడిన ప్ర‌తీసారీ… ‘నాలుగేళ్ల కింద చంద్ర‌బాబు నాయుడు ఏం చెప్పాడూ, ఇళ్లు క‌ట్టి ఇస్తాడ‌ని చెప్పాడా లేదా చెల్లీ, చెప్పాడా లేదా అక్కా..’ అంటూ అందర్నీ అడుగుతారు. ప్ర‌జ‌ల‌తో ఇలా ఇలా ఇలా ఇలా అని చెప్పి చేతులు తిప్ప‌మంటూ చూపిస్తారు!

ఇలా కొన్ని అంశాల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌తీరోజూ ఒకే ర‌క‌మైన మాడ్యులేష‌న్ లో, ఒక త‌ర‌హా భావాప్ర‌క‌ట‌న‌తో, ఒకే రకమై వ్యక్తీకరణతో మాట్లాడుతున్నారు. దీని వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య ఏంటంటే… ప్ర‌తీరోజూ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను మీడియా ద్వారా చూసే ప్ర‌జ‌ల‌కు కొంత బోర్ అనిపిస్తుంది క‌దా! నిజానికి, ప్ర‌తీరోజూ తాను ఒక కొత్త ప్రాంతానికి వెళ్లి మాట్లాడుతున్నాన‌ని జ‌గ‌న్ కి అనిపించొచ్చుగానీ… కానీ, ఆయ‌న మాట్లాడేది ప్ర‌తీరోజూ అన్ని ప్రాంతాల వారూ మీడియా ద్వారా చూస్తున్నారు క‌దా! ఇప్పుడు వాస్త‌వ ప‌రిస్థితి ఎలా ఉందంటే… ఈరోజు జ‌గ‌న్ దేని గురించి మాట్లాడారో, విన‌క‌పోతే మిస్ అవుతామేమో అనే ఉత్సుక‌త చాలామందిలో నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. పాద‌యాత్ర వీడియోల గురించి యూట్యూబ్ లో చూసినా.. ఊరిపేర్లు మారుతున్నాయిగానీ, జ‌గ‌న్ మాట్లాడే విధానం అన్నిచోట్లా ఒకే విధంగా ఉంటోంది క‌దా! సాక్షి ప‌త్రిక‌లో కూడా ప్ర‌తీరోజూ దాదాపు ఒకే ర‌క‌మైన ప్ర‌సంగ పాఠాలు వ‌స్తున్నాయి. ఇదే ధోర‌ణి కొన‌సాగుతూ పోతే.. జ‌గ‌న్ చెప్పే అంశాల తీవ్ర‌త క‌న్నా, ఆయ‌న మాట తీరు రొటీన్ అనే భావ‌న పెరిగే అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌తీరోజూ కొత్తగా మాట్లాడ‌టానికి కొత్త విష‌యాలు ఎక్క‌డి వ‌స్తాయ‌ని అనే ప్రశ్న తలెత్తొచ్చు. కొత్త‌వి రాక‌పోయినా, ఉన్న‌వే కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేయాలి. అదే క‌దా నాయ‌కుడికి కావాల్సిన‌ వాక్చాతుర్య‌మంటే..! పాద‌యాత్ర ఇంకా ఐదు నెల‌ల‌పాటు కొన‌సాగించాల్సి ఉంది. ప్ర‌తీరోజూ స‌భ‌లు ఉంటాయి. ప్ర‌తీరోజూ జ‌గ‌న్ మాట్లాడాల్సి ఉంది. ప్ర‌తీరోజూ ప్ర‌జ‌లు వినాల్సి ఉంది! అలా వినే ఉత్సుక‌తను ప్ర‌జ‌ల్లో త‌గ్గ‌కుండా కాపాడుకోవాలంటే.. వ్యూహ‌క‌ర్త‌లు ఏదో ఒక‌టి చేయాల్సిన అవ‌స‌రం ఉందనే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.