సంఖ్యలన్నా, సెంటిమెంట్లన్నా రాజకీయ నాయకులకు ప్రాణం. అది కలిసి వస్తే కొండలైనా ఎక్కేస్తారు.. కానీ అది ఎదురు తిరిగితే మాత్రం కంటిమీద కునుకు ఉండదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి సరిగ్గా ఇలాంటి 11 ఫోబియా పట్టుకుంది. పార్లమెంట్ భవనంలో తమకు కేటాయించిన 11వ నంబర్ గదిని చూసి వైసీపీ ఎంపీలు ఉలిక్కిపడ్డారు. ఆ అంకెను చూడగానే వారికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు, సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్న టీమ్ 11 పోస్టులు గుర్తుకు వచ్చి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
బలబలాల ప్రాతిపదికన స్పీకర్ కార్యాలయం మొదట వైసీపీకి మొదటి అంతస్తులోని 11వ నంబర్ రూమ్‌ను కేటాయించింది. అయితే, ఈ నంబర్ చూసిన ఎంపీలు ఈ నంబర్ మాకు అస్సలు వద్దు.. ఇది మమ్మల్ని వెక్కిరిస్తున్నట్లు ఉంది అని భావించారు. వెంటనే హుటాహుటిన స్పీకర్‌ను కలిసి, ఆ నంబర్ తమకు కలిసి రావడం లేదని, ఏపీలో తమ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్య కూడా అదే కావడంతో అందరూ హేళన చేస్తున్నారని వాపోయారు. రూమ్ మార్చాలని కోరారు.
వైసీపీ ఎంపీల విన్నపాన్ని విన్న స్పీకర్, వారి సెంటిమెంట్ తిప్పలు చూసి జాలిపడ్డారు. చివరికి 11వ నంబర్ గదిని మార్చి, పక్కనే ఉన్న 12వ నంబర్ గదిని కేటాయించారు. దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఒకప్పుడు 151 సీట్లతో రికార్డు సృష్టించిన పార్టీ, ఇప్పుడు కేవలం ఒక అంకె మారితే చాలు అనుకునే స్థాయికి రావడంపై రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. నంబర్ మార్చినంత మాత్రాన తలరాత మారుతుందా అని ప్రత్యర్థి పార్టీల నేతలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు.
