లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డి, ఏ3 సత్యప్రసాద్‌లు దర్యాప్తు సంస్థకు సహకరిస్తూ, అప్రూవర్లుగా మారినట్లుగా వ్వహరిస్తున్నారు. అందుకే వారిని అరెస్టు చేయలేదు. అయితే వారిని కూడా జైలుకు పంపాలని చెవిరెడ్డి కోర్టులో వారి బెయిల్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేయడమే కాదు పెద్ద లాయర్లతో వాదింపచేస్తున్నారు.
వాళ్లు జైలుకుపోతే చెవిరెడ్డికి లాభమేంటి?
తోటి నిందితుల బెయిల్‌ను మరో సహ నిందితుడు అడ్డుకోవడం చట్ట చరిత్రలోనే అరుదని, ఇది చెవిరెడ్డి తన గొయ్యి తానే తవ్వుకోవడమేనని సెటైర్లు పడుతున్నాయి. లిక్కర్ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన అధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు ఇప్పటి వరకూ అధికారికంగా అప్రూవర్లుగా ప్రకటించలేదు. వారు గనుక నోరు విప్పితే, ఈ అక్రమాల్లో తెరవెనుక ఉన్న పెద్దల జాతకాలు బయటపడతాయని చెవిరెడ్డి భయపడుతున్నట్లు కనిపిస్తోంది. తప్పు చేసిన వారు దర్యాప్తుకు సహకరించి నిజాలు చెబితే, అది కేసు విచారణకు తోడ్పడుతుంది. కానీ, వారిని జైల్లోనే ఉంచాలని చెవిరెడ్డి పట్టుబట్టడం చూస్తుంటే..
మొత్తం ఎక్కడ బయటపెడతారోనని భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.
రివర్స్ కానున్న వ్యూహం.. ఉచ్చు బిగుస్తోంది!
వాస్తవానికి, నిందితులు అప్రూవర్లుగా మారడం అనేది దర్యాప్తు సంస్థల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఇందులో చెవిరెడ్డి జోక్యం చేసుకోవడం ద్వారా ఆయనకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై ఉన్న చెవిరెడ్డి, ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలు, తిరిగి ఆయనపైనే కేసు మరింత బలోపేతం కావడానికి కారణమవుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అడ్డంగా దొరికిపోయి.. మళ్ళీ బాధితుడిలా కలరింగ్!
ప్రతి విషయంలోనూ అతిగా స్పందించి చిక్కుల్లో పడటం చెవిరెడ్డికి అలవాటుగా మారిందని, ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లోనూ అదే పునరావృతమవుతోందని విమర్శలు వస్తున్నాయి. తాను తప్పు చేయనప్పుడు, ఇతరులు అప్రూవర్లుగా మారితే ఆయనకు వచ్చే ఇబ్బంది ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇన్ని తప్పులు చేసి, చివరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే.. రాజకీయ కక్ష సాధింపు అంటూ ఏడవడం ఆయన పాత అలవాటే. ఈ కేసులో తదుపరి పరిణామాలు చెవిరెడ్డికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.
