వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో హడావుడిగా ముగిశాయి. అయితే, ఈ వేడుకల్లో గత ఐదేళ్లుగా ఎప్పుడూ లేని ఒక కొత్త దృశ్యం కనిపించడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా అధికారం ఉన్నా లేకపోయినా, పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించేది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లూ దాదాపు ఆయనే ఈ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. కానీ, ఈసారి సీన్ మారింది. జగన్ స్వయంగా జెండా ఎగురవేసినా, ఆయన వెంటే ఉంటూ అన్నీ తానై నడిపించే సజ్జల మాత్రం ఎక్కడా కనిపించలేదు.
పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యనేతల గైర్హాజరు ప్రస్ఫుటంగా కనిపించింది. ఒకప్పుడు జగన్ పక్కన నిలబడటానికి పోటీ పడే సీనియర్లు, ఇప్పుడు ముఖం చాటేయడం పార్టీలో పెరిగిన దూరాన్ని సూచిస్తోంది. జగన్ పక్కన ఉన్నది దేవినేని అవినాష్ తో పాటు కొంత మంది ముక్కూ ముఖం తెలియని నేతలే. ముఖ్యంగా జగన్ షాడో గా పేరు తెచ్చుకున్న. సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో వచ్చిన మార్పులు, వ్యూహకర్తల మార్పు లేదా అంతర్గత విభేదాల వల్లే ఆయన దూరంగా ఉన్నారా? లేక జగన్ రెడ్డి స్వయంగా కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారా? అన్న సందేహాలు క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి.
ఆవిర్భావ వేడుకలే ఇంత నిస్సారంగా జరగడం.. జగన్ రెడ్డి పక్కన పాత ముఖాలు కనిపించకపోవడం, కొత్త వారు కూడా ఉత్సాహంగా ముందుకు రాకపోవడం చూస్తుంటే పార్టీ యంత్రాంగంలో తీవ్రమైన స్తబ్దత నెలకొన్నట్లు అర్థమవుతోంది. కేవలం జెండా ఎగురవేసి చేతులు దులుపుకోవడం కాకుండా, చెల్లాచెదురైన పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో జగన్ టీమ్ ఇంకా ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం క్యాడర్లో వినిపిస్తోంది.
