సాధారణంగా ఎవరైనా జైలుకు వెళితే సమాజంలో తలవంచుకుంటారు. కానీ, వైసీపీ నేతల తీరు ఇందుకు భిన్నం. తామేదో దేశం కోసం పోరాడి జైలుకు వెళ్లినట్లుగా, విడుదలయ్యాక పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించుకోవడం, స్వీట్లు పంచుకోవడం చూస్తుంటే జైలు శిక్ష వీరికి ఒక మెడల్ లాగా కనిపిస్తోంది. బూతులు తిట్టి జైలుకెళ్లిన అంబటి రాంబాబు నుంచి, హత్యలు, హింసాత్మక ఘటనల్లో ఇరుక్కుని లోపలికి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరకు అందరూ ఇదే బిల్డప్ ఇస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించడాన్ని ఒక వీరకృత్యంగా ప్రదర్శించుకోవడం వెనుక ఉన్న మానసిక స్థితిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నారై?
వీరికి ప్రజల ఫీడ్ బ్యాక్ పట్ల కనీస గౌరవం లేదనిపిస్తోంది. తాము ఏం చేసినా, ఎంతటి దారుణమైన పదజాలం వాడినా ప్రజలు గొర్రెల్లా సమర్థిస్తారనే ఒక గుడ్డి నమ్మకంలో వీరు బ్రతుకుతున్నారు. సమాజం తమను ఏమని పిలుస్తోంది.. తమ మాటలు యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి.. అన్న చిన్న సందేహం కూడా వీరిలో కలగదు. ప్రజల నాడిని పట్టే సర్వేలు చేయించుకున్నా వీరికి అసలు విషయం తెలుస్తుంది. ప్రజా వ్యతిరేకతను మార్చుకునే ప్రయత్నం కంటే, మరింత రెచ్చిపోయి మాట్లాడటమే తమ బలం అని వీరు భ్రమిస్తున్నారు.
బూతుల సంస్కృతే బలం
వైసీపీలో ఒక నేతకు ప్రాధాన్యత దక్కాలంటే అది వారి దూషణల తీవ్రతపైనే ఆధారపడి ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అసెంబ్లీలో గానీ, ప్రెస్ మీట్లలో గానీ ప్రత్యర్థుల కుటుంబాలను సైతం లాగుతూ బూతులు తిట్టడాన్నే తమ గొప్పతనంగా చెప్పుకోవడం వీరి వికృత రాజకీయానికి ప్రతీక. ప్రజల సంక్షేమం కంటే, ప్రత్యర్థులను ఎంతగా కించపరిచామన్నదే వీరి విజయానికి కొలమానంగా మారింది. తాము చేసిన అరాచకాలను కూడా ప్రజా పోరాటాలు అని నామకరణం చేయడం వీరి నైతిక పతనానికి పరాకాష్ట. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం తమదే అంతిమ సత్యమని, తాము ఏం చేసినా చెల్లుతుందని భావిస్తారు. ఈ అహంకారమే వారిని వాస్తవానికి దూరం చేస్తోంది.
ప్రజలు అసహ్యించుకుంటున్నా గుర్తించరా?
అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదన్న ధీమా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ తప్పులను ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడమే వీరి వ్యూహం. ప్రజా తీర్పు ఇచ్చిన షాక్ నుంచి కూడా వీరు పాఠాలు నేర్చుకోలేదని వారి తాజా ప్రవర్తనలే స్పష్టం చేస్తున్నాయి. నేరాలను కప్పిపుచ్చుకుంటూ, అరాచకాలను అలంకారాలుగా మార్చుకోవడం ఎంతో కాలం సాగదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు.. వీరు ఇస్తున్న ఈ బిల్డప్ లు ప్రజల ముందు పరువు తీస్తున్నాయి. సమాజంలో ఉన్నత విలువలు కోరుకునే సామాన్యుడు.. వైసీపీ నేతల ఈ వైఖరిని అసహ్యించుకుంటున్నారనేది వాస్తవం. ఇప్పుడైనా తమ ధోరణి మార్చుకోకపోతే, రాజకీయ ప్రస్థానంలో మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది.
