ఇదేనండీ.. రోజా వ్యాఖ్య‌ల‌తో వ‌చ్చే ఇబ్బంది..!

వైకాపా ఎమ్మెల్యే రోజా… మైకు ముందుకు వ‌చ్చారంటే చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉంటారు. టీడీపీ పాల‌న‌ను ఎండ‌గ‌డుతూనే ఉంటారు. కాక‌పోతే, ఆమె చేసే వ్యాఖ్య‌లుగానీ, విమ‌ర్శ‌లుగానీ, ఆరోప‌ణ‌లుగానీ, ఎద్దేవాకానీ… వైకాపాకి ఏదైనా మైలేజ్ ఇస్తోందా లేదా అనే విశ్లేష‌ణ పార్టీలో జ‌రుగుతోందో లేదో వారికే తెలియాలి. కొన్ని కీల‌క‌మైన అంశాల‌పై స్పందిస్తున్న‌ప్పుడు, ఆ వ్యాఖ్య‌ల ద్వారా వైకాపా నిస్స‌హాయ‌త లేదా బ‌ల‌హీన‌త బ‌య‌ట‌ప‌డే విధంగా ఉండ‌కూడ‌దు క‌దా! ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విశాఖ వెళ్లారు, పోల‌వ‌రం సందర్శించారు, కృష్ణాన‌దిలో బోటు తిర‌గ‌బ‌డి మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను కూడా ప‌వ‌న్ క‌లుసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైకాపా ఎమ్మెల్యే రోజా కొన్ని విమ‌ర్శ‌లు చేశారు.

రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాలంటే రాజ‌కీయ అనుభ‌వం ఉండాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై రోజా స్పందిస్తూ… ఏ అనుభ‌వం ఉంద‌ని చిరంజీవి ఆనాడు పార్టీ పెట్టార‌న్నారు. నారా లోకేష్ కు ఏ అనుభ‌వం ఉంద‌ని మంత్రి క‌ట్ట‌బెట్టార‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌రా అన్నారు. వైకాపా పెట్ట‌క‌ముందు జ‌గ‌న్ ఎంపీగా పోటీ చేశార‌నీ, వైయ‌స్ బ‌తికున్న రోజుల్లో జిల్లా పార్టీ బాధ్య‌త‌లు చూశార‌ని రోజా చెప్పుకొచ్చారు. రోజా చేసిన ఈ కామెంట్ వ‌ల్ల రెండు ర‌కాల చ‌ర్చ‌కు ఆస్కారం ఇచ్చారు. మొద‌టిది… జ‌గ‌న్ కు అనుభవం లేదు, కాబ‌ట్టి ముఖ్య‌మంత్రి కాలేరు అని ప‌వ‌న్ క‌ల్యాణ్ సూటిగా చెప్ప‌లేదు. జ‌గ‌న్ పేరునే ఆయ‌న నేరుగా ప్ర‌స్థావించ‌డం లేదు. ప‌వ‌న్ టార్గెట్ జ‌గ‌నే కావొచ్చుగానీ, ‘జ‌గ‌న్‌’ అనే మాటే ఆయ‌న ఇంత‌వ‌ర‌కూ ఉప‌యోగించ‌లేదు. రోజా ఈ విషయం గమనించట్టు లేరు. ఇక‌, రెండోది.. జ‌గ‌న్ అనుభ‌వం గురించి ఆమె వివ‌ర‌ణ ఇచ్చిన తీరు. ఏ అనుభవం లేని లోకేష్ ను మంత్రిగా చేశార‌నీ, రేప్పొద్దున్న లోకేష్ ను ముఖ్య‌మంత్రిని ఎలా చేస్తార‌ని చంద్ర‌బాబును ప‌వ‌న్ ఎందుకు ప్ర‌శ్నించ‌రు అన్నారు. తండ్రి హ‌యాంలోనే జ‌గ‌న్ ఎంపీ అయ్యారూ, పార్టీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారూ ఈ అనుభ‌వం జ‌గ‌న్ కి స‌రిపోతుంద‌ని ఆమె చెప్పారు. ఆ లెక్క‌న‌, లోకేష్ కూడా పార్టీ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు క‌దా, త‌రువాత ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి అయ్యారు. ఈ త‌ర‌హా వాద‌న తెర‌మీదికి తెచ్చి.. లోకేష్ స్థాయిని, జ‌గ‌న్ కు స‌మానంగా ఆమే పెంచుతున్న‌ట్టుగా ఉంది!

పోల‌వ‌రం ప్రాజెక్టులో అవినీతి చేశారు కాబ‌ట్టి, ఇంకోప‌క్క జ‌గన్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర వంద‌రోజులకు చేర‌బోతుంది కాబ‌ట్టి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఏపీ ప‌ర్య‌ట‌న‌కు టీడీపీ దించింద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో స‌మ‌స్యల గురించి మాట్లాడండీ అంటూ టూర్ మ్యాప్ వేసి మరీ ప‌వ‌న్ ను రంగంలోకి దించార‌న్నారు. పోల‌వ‌రం టూర్ అనేది ప‌వ‌న్ ప్రోగ్రామ్ లేక‌పోయినా, వైకాపా వ‌స్తోంది కాబ‌ట్టి, తమకంటే ముందు హ‌డావుడి చేయాల‌నే ప‌వ‌న్ ను పంపారు అన్నారు. ప్ర‌తిపక్షం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌కూడ‌ద‌న్న కుట్ర దీని వెన‌క ఉంద‌న్నారు. రోజా చేసిన ఈ కామెంట్ వ‌ల్ల రెండు ర‌కాల చ‌ర్చ‌కు ఆస్కారం ఇచ్చారు. మొద‌టిది… ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నంలోకి వ‌స్తే, జ‌గ‌న్ కంటే ఎక్కువ ప్రాధాన్య‌త ల‌భిస్తుంద‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టుంది. ఇక‌, రెండోది… వైకాపా వ్యూహాల్లో లోపాల‌ను ఒప్పుకోవ‌డం! రాష్ట్రంలోని ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తిప‌క్షం కంటే కాస్త ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందిస్తార‌నేది కొత్త విష‌య‌మేమీ కాదు. రాజ‌ధాని నిర్వాసితులు, ఆక్వా రైతుల స‌మ‌స్య‌, ఉద్దానం కిడ్నీ బాధితులు, వైద్య విద్యార్థులు.. ఇలా ఏది తీసుకున్నా ప్ర‌తిప‌క్షం కంటే ముందుగానే ప‌వ‌న్ స్పందిస్తున్నారు. సో… వైకాపా ప్రాధాన్య‌త‌ను త‌గ్గించ‌డం కోస‌మే ప‌వ‌న్ ను టీడీపీ పంపిస్తోంద‌ని ప్ర‌తీసారీ వారు చెబుతున్న మాటే. ఆ సంగ‌తి ప్రతీసారీ తెలుస్తున్నప్పుడు ఆ వ్యూహాన్ని వైకాపా ఎందుకు తిప్పి కొట్ట‌లేక‌పోయింది..? ఆ నిస్స‌హాయ‌త‌ను రోజా అంగీక‌రిస్తున్న‌ట్టుగా ఉంది.

అభివృద్ధి చేయ‌డానికి అధికారం అవ‌స‌రం లేద‌ని ప‌వ‌న్ అంటున్నాకదా, మ‌రి మీరు రుణ‌మాఫీ చేసెయండ‌నీ, పెన్ష‌న్లు ఇచ్చేయండీ, ఇళ్ల క‌ట్టించేయండీ, పోల‌వ‌రం కూడా క‌ట్టేయండ‌ని రోజా ఎద్దేవా చేశారు. కొన్ని ప‌నులు అధికారం ఉంటేనే చేయ‌గ‌ల‌మ‌నీ, మ‌న‌సుంటేనే చేయ‌గ‌మ‌ని రోజా అన్నారు. రోజా చేసిన ఈ కామెంట్ వ‌ల్ల రెండు ర‌కాల చ‌ర్చ‌కు ఆస్కారం ఇచ్చారు. మొద‌టిది… నిజానికి, అభివృద్ధికీ అధికారానికీ ప‌వ‌న్ లింక్ పెట్ట‌లేదు. ఒక మంచి చేయాల‌నుకుంటే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌భావంతంగా ప్ర‌య‌త్నించొచ్చు అన్నారు. ప‌వ‌న్ మాట‌ను రోజా స‌రిగా విన‌లేద‌ని అనిపిస్తోంది. ఇక, రెండోది.. అధికారం చ‌ర్చ‌! కొన్ని ప‌నులు అధికారంలో ఉంటే మాత్ర‌మే చేయ‌గ‌ల‌మ‌ని చెబుతూనే, ప్ర‌తిప‌క్షంలో ఉండగా వైకాపా ఏమీ చేయ‌లేక‌పోయింద‌ని అనే అర్థం వ‌చ్చిన‌ట్టుగా రోజా మాట్లాడ‌టం! ఓవ‌రాల్ గా రోజా స్పందించిన తీరు చూస్తుంటే.. రెండు ర‌కాల అభిప్రాయాల‌కు ఆస్కారం ఇచ్చేట్టుగానే ఉన్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.