వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. పదకొండు నిమిషాలు ఉండి వెళ్లిపోయారు. రేపటి నుంచి ఎలాగూ ఆ పదకొండు నిమిషాలు రావు. ఈ రోజు సభా హాజరు లెక్కలోకి రాదని శాసనసభ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారు రారు. ఈ సమావేశాలు సుదీర్ఘంగా సాగబోతున్నాయి. 17 పనిదినాలు ఉంటాయి. అంటే అరవై రోజుల అర్హత వైసీపీ ఎమ్మెల్యేలందరికీ వచ్చినట్లే. కానీ సభా కార్యక్రమాలు జరిగిన ఒక్క రోజు వారు హాజరైతే.. మళ్లీ అరవై పనిదినాల వరకూ వెళ్లకపోయినా పర్వాలేదు. అనర్హతా వేటును స్పీకర్ వేయలేరు.
ఎలాగూ గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు కాబట్టి అసెంబ్లీ బహిష్కరణ అనే శపథాన్ని ఎప్పుడో ఉల్లంఘించేసినట్లయింది. ఇప్పుడు మిగతా రోజులు వచ్చినా వారికి పోయేదేమీ ఉండదు. పైగా ప్రజాసమస్యలపై చర్చకు రాకుండా పారిపోతున్నారన్న చెడ్డపేరు వస్తుంది. అదే సమయంలో అసెంబ్లీకి వచ్చే ముందు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఫ్లెక్సీలు, పోస్టర్లు, ప్లకార్డులతో అసెంబ్లీకి వచ్చారు. అది ప్రజా సమస్య కాదు. అయినా పట్టుకుని వచ్చారు. సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ జరుగుతున్నా.. రేపటి నుంచి కూడా ఇాలాగే.. ప్రజా సమస్యలపై ఫ్లెక్సీలు పట్టుకుని సభకు వచ్చి.. పదకొండు నిమిషాలు కూర్చుని వాకౌట్ చేసి వెళ్లిపోతే కనీసం హాజరైన పడుతుంది.
అసెంబ్లీకి వెళ్లాము..మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అందుకే పదకొండు నిమిషాల్లో వెనక్కి వచ్చేశామని ప్రజల ముందు చెప్పుకోవచ్చు. కానీ జగన్ అలాంటి చాన్స్ కూడా ఇవ్వడం లేదు. ఆయన సమయం రాగానే బెంగళూరు వెళ్లిపోతారు.గురువారం ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అవుతారు. ఎమ్మెల్సీలు సభకు వెళ్లి ఏం చేయాలో చెప్పి.. ఎమ్మెల్యేలు ఇంటికెళ్లిపోవాలని సలహాలిచ్చి తాను బెంగళూరు వెళ్లే అవకాశం ఉంది. కనీసం తాము అయినా సభకు వెళ్లేలా జగన్ మనసు మారితే బాగుండని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు.
