వైకాపా ఎంపీల రాజీనామాకి సరైన స‌మ‌యం ఇది కాద‌ట‌…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోసం తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌నీ, త‌మ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోరాటం చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైకాపా ఎంపీలు చాన్నాళ్లుగా చెబుతున్న‌మాటే. ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం సాగిస్తామ‌నీ, అవ‌స‌ర‌మైతే రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని చాలాసార్లు చెప్పారు. ఇవాళ్ల కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌వేశపెట్టిన బ‌డ్జెట్ కేటాయింపుల‌పై వైకాపా ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. విభ‌జ‌న హామీల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా పూర్తిస్థాయిలో అమ‌లు చేసే విధంగా బ‌డ్జెట్ లో కేటాయింపులు లేవంటూ విమ‌ర్శిస్తున్నారు.

బ‌డ్జెట్ అనంత‌రం వైకాపా ఎంపీ విజ‌య సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైల్వేజోన్ విష‌యంలో కేంద్రం లేనిపోని లెక్క‌లు చెబుతోంద‌నీ, రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఈ అంశంపై ఆస‌క్తి చూపక పోవ‌డంతో ఆంధ్రప్ర‌దేశ్ కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు. మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌నీ, అయితే రాజీనామాలు చేస్తే ఏపీకి రావాల్సిన‌వి వ‌చ్చేస్తాయా అంటూ ప్ర‌శ్నించారు. పార్ల‌మెంటులో తెలుగుదేశం ఎంపీలు మాట్లాడ‌టం లేద‌నీ, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతూ నోరు మెద‌ప‌డం లేద‌న్నారు. పార్ల‌మెంటులో తాము కూడా లేక‌పోతే ఆంధ్రా గురించి అడిగేవారు ఉండ‌ర‌ని ఆయ‌న చెప్పారు. రాజీనామాల విష‌యంలో ఎప్పుడో స్ప‌ష్ట‌త ఇచ్చామ‌నీ, ఇప్పుడు తాము రాజీనామా చేసి వెళ్లిపోతే ప్ర‌త్యేక హోదా అంశ‌మూ విభ‌జ‌న చ‌ట్టంలో అంశాల గురించి ప్ర‌శ్నించేవారు ఎవ‌రుంటారు అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

రాజీనామాల‌కు కట్టుబడి ఉంటామ‌నీ, త‌మ పార్టీ అధ్య‌క్షుడు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు చేస్తామ‌నీ, కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని, అప్పుడు కూడా కేంద్రం దిగి రాక‌పోతే రాజీనామాల‌కు తాము సిద్ధ‌మే అని చెప్పారు. ఆంధ్రాకు ప్ర‌త్యేక హోదాతోపాటు, విభ‌జ‌న అంశాల‌న్ని అమ‌లు చేస్తామ‌ని భ‌రోసా ఇస్తే… ఈ క్ష‌ణ‌మే రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌మ‌ని కూడా సుబ్బారెడ్డి అన్నారు. సో… ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న అంశాల‌పైనా వైకాపా పోరాటం మున్ముందు ఉంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు…! అయితే, ఇప్పుడు బ‌డ్జెట్ లోనే కేటాయింపులు లేన‌ప్పుడు… ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ పోరాటాలు చేస్తే కేంద్రం కొత్త‌గా దిగొచ్చే ప‌రిస్థితి మున్ముందు ఉంటుందా..? ఉంటే మంచిదే. కానీ, మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఆ త‌రువాత‌, బ‌డ్జెట్ అంటూ ఉంటే అది ఓటాన్ అకౌంట్ మాత్ర‌మే క‌దా! అంతిమంగా చెప్పొచ్చే అంశం ఏంటంటే… కేంద్రంపై వైకాపా ఎంపీలు పోరాటం చేసేందుకు ఇంకా స‌రైన స‌మ‌యం రాలేద‌న్న‌మాట‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.