ఉప ఎన్నిక‌ల‌కు జ‌గన్ సిద్ధంగా లేరు.. ఇదిగో సాక్ష్యం!

ప్ర‌త్యేక హోదా కోస‌మే త‌మ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశార‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మ‌రోసారి చెప్పారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న ఆయ‌న‌… రాజీనామాలు చేసిన వైకాపా ఎంపీల‌కు సెల్యూట్ చేశారు! రాజీనామాలు చేసిన ఎంపీల గురించి మాట్లాడారు. త‌మ పార్టీ ఎంపీలు భ‌యం లేకుండా రాజీనామాలు చేశార‌నీ, రాష్ట్రంలోని 25 మంది పార్ల‌మెంటు స‌భ్యులూ ఇలానే చేసి ఉంటే కేంద్రంపై ఒత్తిడి పెరిగేద‌నీ, ఈపాటికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉండేదని జ‌గ‌న్ అన్నారు. అధికార పార్టీ ఎంపీల‌తో రాజీనామాలు చేయించేందుకు ముఖ్య‌మంత్రి భ‌య‌ప‌డ్డార‌ని విమ‌ర్శించారు.

ఉప ఎన్నిక‌లు అంటూ వ‌స్తే తాము సిద్ధంగా ఉన్నామ‌ని జ‌గ‌న్ అన్నారు. అయితే, ఆ వెంట‌నే మ‌రో ట్విస్ట్ కూడా ఇచ్చారండోయ్..! అదేంటంటే.. త‌మ పార్టీ ఎంపీలు ప్ర‌త్యేక హోదా రాజీనామాలు చేశార‌నీ, ఇలాంటివారు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే… బుద్ధి ఉన్న పార్టీలేవీ ప్ర‌త్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపే ప్ర‌య‌త్నం చెయ్య‌ద‌న్నారు. అలా కాద‌ని, ఒక‌వేళ ఎవ‌రైనా అభ్య‌ర్థుల‌ను నిల‌బెడితే… అలా నిల‌బ‌డ్డ‌వారు ప్ర‌త్యేక హోదాకు అనుకూల‌మా, ప్ర‌తికూల‌మా అనే ప్ర‌శ్న ప్ర‌జ‌ల్లో వ‌స్తుంద‌ని జ‌గ‌నే చెప్ప‌డం విడ్డూరం! ఇక్క‌డితో కూడా ఆగ‌లేదు.. అయినాస‌రే దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపితే, పోటీకి తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. ఉప ఎన్నిక‌లు వ‌స్తే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని ఎద్దేవా చేశారు.

జ‌గ‌న్ మాట‌లు ఎలా ఉన్నాయంటే… ఉప ఎన్నిక‌ల‌కు ఎవ్వరూ దిగొద్దూ తాము మాత్రమే పోటీకి దిగుతాం అన్న‌ట్టుగా ఉన్నాయి! అంటే… ఇతర పార్టీలకు కూడా ఈయనే అజెండా సెట్ చేస్తారా..? ప్ర‌త్యేక హోదా కోసం మేం రాజీనామాలు చేశాం, మీరూ చెయ్యండీ అని చెప్పందీ వారే! ఉప ఎన్నిక‌ల‌కు మేం సిద్ధంగా ఉన్నాం… చేత‌నైతే ఎదుర్కొనండీ అని స‌వాలు చేసిందీ వారే..! ఇప్పుడు, మేం ఉప ఎన్నిక‌ల‌కు వెళ్తాం.. మీరు పోటీకి దిగొద్ద‌నీ అంటున్న‌దీ వారే. ఇదెక్క‌డి సిద్దాంతం..? రాజీనామాలు చేసిన వైకాపా ఎంపీలు మ‌రోసారి పోటీకి దిగొచ్చ‌ట‌… కానీ, వారిపై ప్ర‌త్య‌ర్థి పార్టీలు అభ్యర్థులను పోటీకి దింపితే, హోదాపై అనుకూల‌మా ప్ర‌తికూల‌మా అనే ప్ర‌శ్న ప్ర‌జ‌ల్లో వ‌చ్చేస్తుంద‌ట‌..! వైకాపా చిత్త‌శుద్ధి ఏ స్థాయిలో ఉంద‌ని చెప్ప‌డానికి, ఇంత‌కంటే ఇంకేం కావాలి. ఏతావాతా ఇక్క‌డ అర్థం చేసుకోవాల్సిన మరో విష‌యం ఏంటంటే… ఉప ఎన్నిక‌లకు వైకాపా సిద్ధంగా లేదన్న‌ట్టుగానే జ‌గ‌న్ మాట‌లు ధ్వ‌నిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com