ఓట‌ర్ల జాబితాపై న్యాయ పోరాటానికి వైకాపా సిద్ధం..!

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ కూడా ఓట‌ర్ల జాబితాపై న్యాయ పోరాటం చేసిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో ఇప్పుడు ఏపీలో వైకాపా సిద్ధ‌మౌతోంది! ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఓట‌ర్ల జాబితాను వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌రిశీలించింద‌నీ, చాలా లోపాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌న్నారు ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. దాదాపు 45 వేల పోలింగు బూత్ ల‌లో ప‌రిశీలించాక చాలా త‌ప్పుల‌ను తాము గుర్తించామ‌న్నారు. క‌నీసం యాభై శాతం ఓట‌ర్ల జాబితా అయినా తాము పూర్తిగా ప‌రిశీలించ‌లేద‌నీ, ఈలోపుగానే కొన్ని లోపాలు త‌మ‌కు క‌నిపించాయ‌న్నారు. ఒకే వ్య‌క్తి పేరులో చిన్న‌చిన్న మార్పుల‌తో రెండేసి ఓట్లు ఉన్న‌వారు కొంత‌మంది ఉన్నార‌న్నారు. అలాంటివారి సంఖ్య దాదాపు 34 ల‌క్ష‌ల‌కుపైగా ఉన్న‌ట్టు తమ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. తెలంగాణ‌తోపాటు, ఆంధ్రాలో ఉన్న ఓట‌ర్ల సంఖ్య కూడా 18 ల‌క్ష‌ల‌కుపైగా ఉంద‌న్నారు.

ఈ లోపాల‌ను స‌వ‌రించాల్సిందిగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ను తాము కోరామ‌న్నారు విజ‌య‌సాయి రెడ్డి. దీనికి తాము సూచించిన ప‌రిష్కార మార్గం… ఓట‌ర్ల జాబితాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయ‌డ‌మే అన్నారు. అలా చేస్తే, ఒక వ్య‌క్తికి ఒక ఓటు మాత్ర‌మే ఉంటుంద‌న్నారు. ఎన్నిక‌ల సంఘానికి దృష్టికి తీసుకెళ్లిన అంశాల‌పై వెంట‌నే చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆశిస్తున్నామ‌నీ, లేక‌పోతే తాము న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఓట‌ర్ల జాబితాలో అక్ర‌మాల‌పై కోర్టుకు వెళ్తే తాము విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు విజ‌య‌సాయి రెడ్డి.

అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది… కానీ, ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు కార‌ణం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని చివ‌ర్లో ఆరోపించారు! ప్ర‌తీ నియోజ‌క వ‌ర్గంలో దొంగ ఓట‌ర్ల‌ను చంద్ర‌బాబు నాయుడే రిజిస్ట‌ర్ చేశార‌న్నారు. ఆ పార్టీకి అనుకూలంగా జాబితా మార్చేశార‌న్నారు. అంతేకాదు, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్ల‌ను జాబితా నుంచి అక్ర‌మంగా తొల‌గించార‌నీ ఆరోపించారు. అయితే, ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌ల గురించి లెక్క‌లతో స‌హా వివ‌రించిన విజ‌య‌సాయి రెడ్డి… దానికి కార‌ణ‌మైన చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌ల ద‌గ్గ‌రకి వ‌చ్చేస‌రికి లెక్క‌లూ ఆధారాల్లాంటివేవీ మాట్లాడ‌లేదు! వైకాపావారి ఓట్ల‌ను తీయించేశారు అని చెబుతున్న‌ప్పుడు… ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా అనేది కూడా ఆధారాల‌తో మాట్లాడితే మ‌రింత అర్థ‌వంతంగా ఉండేది క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.