సరిహద్దుల్లో తగాదాలు. భూభాగంపై వివాదాలు. చైనాతో సమస్యలు మనకు మామూలే. ఇప్పుడు వ్యాపార పరంగా ఓ విషయంలో డ్రాగన్ చైనా మనకు పోటీకి వచ్చింది. మన ఆదాయానికి గండికొడుతోంది. తల వెంట్రకుల ఎగుమతుల్లో మనకు పెద్ద పోటీదారుగా మారింది. ఇప్పటి వరకు ఈ విషయంలో మనమే ప్రపంచంలో నెంబర్ వన్. ఇప్పుడు చైనా దూసుకొచ్చింది.
మన దేశంలో తిరుమలకు వెళ్లినా, మరో గుడికి వెళ్లినా భక్తితో తలనీలాలు సమర్పిస్తుంటారు. అవి ఆలయాలకు కాసుల వర్షం కురిపిస్తాయి. మన దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడతాయి. ప్రపంచ వ్యాప్తంగా తల వెంట్రుకులను భారత్ ఎగుమతి చేస్తుంది. దీని ద్వారా రెండేళ్ల క్రితం 2,354 కోట్ల రూపాయల ఆదాయాన్ని మన దేశం ఆర్జించింది. గత ఏడాది మన ఆదాయంలో సుమారు 400 కోట్ల కోత పడింది. అంటే దాదాపు 17 శాతం రాబడికి గండి పడింది. దీనికి కారణం, చైనా పోటీ. మన సరుకు ఎంతో నాణ్యమైంది. ధర కూడా అదే రేంజిలో ఉంటుంది. చైనా సరుకు అంత నాణ్యమైంది కాదు. కానీ మనతో పోలిస్తే 30 శాతం ధరకే ఎగుమతి చేస్తోంది.
నాణ్యత కాస్త తక్కువైనా ధరలో చాలా తేడా ఉందనే ఉద్దేశంతో చాలా దేశాలు చైనా మాల్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఒకప్పటి వైభవం లేని ఐరోపా దేశాలు చైనా మాల్ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో మన సరుకు విక్రయాలు తగ్గాయి. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకు తలనీలాల ఇ-వేలం ద్వారా ఏటా 200 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. కానీ గత ఏడాది 173 కోట్లు మాత్రమే వచ్చింది. ఇదంతా చైనా పోటీ ప్రభావం.
ప్రపంచ వ్యాప్తంగా విగ్గుల తయారీ, ఇతర అవసరాల కోసం నాణ్యమైన తల వెంట్రుకలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటి వరకూ దీనికోసం అంతా ఇండియా వైపే చూశారు. ఇప్పుడు అనూహ్యంగా చైనా దూసుకు వచ్చింది. తయారీ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న చైనా, ఇప్పుడు ఈ విషయంలోనూ గట్టి పోటీ ఇస్తోంది. మనకంటే భారీగానే ఎగుమతులు చేస్తోంది. ప్రస్తుతం చైనా తల వెంట్రుకల ఎగుమతుల విలువ 13 వేల కోట్ల రూపాయలకు పైనే అని ఓ అంచనా. ఇది మనకంటే చాలా చాలా ఎక్కువ. అయితే నాణ్యత మాత్రం నాసిరకం. కానీ డబ్బులు మిగులుతున్నాయంటే నాణ్యత విషయంలో రాజీపడ్డా తప్పులేదనే పలు దేశాల ధోరణి మన కొంప ముంచుతోంది. మేలిమి బంగారం లాంటి నాణ్యమైన సరుకును ఇస్తామన్నా చాలా మంది చైనా మాల్ కొంటున్నారు. ఇది మనకు ఆదాయానికి గండి కొడుతోంది. ముందు ముందు ఈ పోటీ మరింత తీవ్రంగా కావచ్చని, ఆదాయం మరింత తగ్గవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.