ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని కేంద్రస్ధానమైన సీడ్ కేపిటల్ ప్లాన్ లేదా ‘కేపిటల్ సిటి’ లో ప్రయివేటు ఆస్ధులు వుండవా?
భూమి సేకరణ, సమీకరణలపై రాష్ట్రప్రభుత్వానికి, పవన్ కల్యాణ్ కీ అభిప్రాయబేధాలు బయటపడటానికి మూలమైన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యానాలను బట్టి ఈ అనుమానం కలుగుతోంది. మధ్యలో కొంత ప్రయివేటు భూమి వుండిపోతే రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు. రాష్ట్రరాజధానుల్లో ప్రయివేటు ఆస్ధులువున్నాయి. హైదరాబాద్ లో రాజభవన్ చుట్టూ, సెక్రెటేరియట్ చుట్టూ ప్రయివేటు భవనాలు వున్నాయి.
పార్లమెంటు, సుప్రీంకోర్టు, రాయబార కార్యాలయాలు, మంత్రుల పార్లమెంటు సభ్యుల, మాజీల నివాసాలూ…సమస్త ప్రభుత్వమూ ఢిల్లీని ఆనుకుని వున్న న్యూఢిల్లీ లోనే వున్నాయి. ఆనగరంలో భవనాలు, భూములు, ఖాళీస్ధలాలు ప్రభుత్వానివే! అక్కడ వుండే వారికి సర్వీసుల కోసం పనిచేసే రెస్టారెంట్లవంటి వ్యాపారాలకు భవనాలు స్ధాలాలను ప్రభుత్వం లీజుకే ఇస్తుంది. అంటే న్యూఢిల్లీ భారీ వ్యాపార స్ధావరం కాదు.
అయితే సింగపూర్ నిపుణులు గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి వచ్చి ముఖ్యమంత్రికి అందజేసిన నమూనా నిర్మాణాల బొమ్మలు చూస్తే అది గోప్ప టూరిస్టు స్పాట్ లా వుంది. సువిశాలమైన పార్కులు, కిలోమీటర్ల తరబడి నీటి ప్రవాహాలు, ఆకాశంలోకి విస్తరించిన భవనాల్లో మనుషులు వుండకపోతే వాటి ప్రయోజనం వుండదు. సొంత ఆస్ధి కాకపోతే అక్కడ ఎవరూ వుండరు.
ఆ నిర్మాణాలన్నీ ఒక అవగాహన కల్పించడానికి తయారైనవిమాత్రమేనని, మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్మాణాలు వుంటాయని మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ చెప్పారు.
ఆకారం ఎలా వున్నా న్యూఢిల్లీ మాదిరిగా సీడ్ కాపిటల్ లో కేవలం ప్రభుత్వం, ప్రభుత్వ సంబంధిత మనుషులే వుండే పక్షంలో అంతేసి పటాటోపమైన నిర్మాణాలు అవసరం లేదు. ఇది దేశరాజధాని తరహాలో సొంతనిధులతో కాక డెవలప్ మెంటు పద్ధతిలో నిర్మించే రాజధానికాబట్టి బిల్డర్లకి ఇచ్చే భాగాన్ని వారు అమ్ముకుని సొమ్ము రాబట్టుకుంటారు. అంటే బాగాసంపన్నులే కేపిటల్ సిటీలో సొంత ఆస్ధులు కొనుక్కోగలుగుతారు. ఇది పేదరైతులనుంచి బలవంతంగా లాక్కున్న భూములను సంపన్నులకి కట్టబెట్టడమే అవుతుంది.
ఇందువల్లే భూమిని సమీకరిస్తే సరేగాని సేకరించవద్దని పవన్ కల్యాణ్ చెప్పారని అర్ధమౌతోంది.