ప్రో కబడ్డీ పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఐపీఎల్ తో సమానంగా ఈ టోర్నీ ఆదరణ పొందింది. మొత్తానికి లీగ్ దశ ముగిసి సెమీస్ కు రంగం సిద్ధమైంది. గురువారం నాడు సెమీఫైనల్ యుద్ధం జరగబోతోంది. ముంబైలో రాత్రి 8 గంటలకు జరిగే తొలి సెమీస్ లో హైదరాబాద్ తెలుగు టైటాన్స్ తో బెంగళూరు జట్టు తలపడుతుంది. రెండు జట్లూ బలంగానే ఉన్నాయి. అయితే లీగ్ దశలో హైదరాబాద్ జట్టు అనేక సంచలనాలను నమోదు చేసింది. అదే జోరు కొనసాగిస్తే బెంగళూరు బుల్స్ కొమ్ములు వంచడం సాధ్యమే.
హైదరాబాద్ జట్టులో ప్రధాన రైడర్ రాహుల్ చౌదరి అంచనాలకు మించి రాణిస్తాడా, ముఖేష్ తదితరులు రెచ్చిపోయి ఆడతారా అనేది చూడాలి. రైడర్స్, డిఫెండర్ల విషయంలో హైదరాబాద్ తో నువ్వానేనా అనే స్థాయిలో బెంగళూరు జట్టులోనూ కొందరు కీలక ఆటగాళ్లున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. లీగ్ దశలో హైదరాబాద్ పై బెంగళూరు జట్టే పైచేయి సాధించింది. హైదరాబాద్ పోరాడి ఓడింది. అయితే సెమీస్ లో ప్రతీకారం తీర్చుకుని ఫైనల్ కు చేరాలని తెలుగు టైటాన్స్ జట్టు ఉవ్విళ్లూరుతోంది.
మరో మ్యాచ్ లో యు ముంబా జట్టు పాట్నా పైరేట్స్ తో తలపడుతుంది. ఈ టోర్నీలో అద్భుత విజయాలను సాధించిన యు ముంబా జట్టే హాట్ ఫేవరేట్ అని అప్పుడే టాక్ మొదలైంది. అయితే అనుకోని సమయంలో అనూహ్యంగా రెచ్చిపోయి ఆడటం పాట్న జట్టు ప్రత్యేకత. ఆ జట్టు ఎప్పుడు పులిలా చెలరేగుతుందో, జింక పిల్లలా భయపడుతూ తడపబడుతుందో తెలియదు. అదే ఆ జట్టు బలం, బలహీనం, అయితే ఫైనల్ చేరేది మాత్రం ముంబై జట్టే అని గట్టి వాదించే కబడ్డీ అభిమానులే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ముంబై జట్టు ఆ అంచనాలను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.