పాపం… తెలుగు మీడియాకు ఎంత కష్టమొచ్చింది !

తెలుగు మీడియాకు చాలా పెద్ద కష్టం వచ్చింది. కోట్ల రూపాయల అడ్వర్టయిజ్ మెంట్లు ఇస్తూ మహారాజ పోషకులుగా వర్ధిల్లుతున్న కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇబ్బంది కలిగే వార్తల విషయంలోనూ వాటి పేర్లు రాయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వచ్చినందుకు కొన్ని మీడియా సంస్థలు తెగ ఇదై పోతున్నాయట. ఇంతకాలం కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఆడింది ఆటగా, ఇష్టారాజ్యంగా సాగింది. ఇప్పుడు కడపలోని నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనలో కాలేజీ పేరు రాయాల్సి వస్తోంది. ఇదొక్కటే కాదు, ఇటీవల కొన్ని సందర్భాల్లో కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో జరిగిన ఘటనల్లో ఒకరు కాకపోతే మరొక మీడియా సంస్థ వారు కాలేజీ పేరు రాస్తున్నారు. దీనివెనుక ఉద్దేశాలు వేరై ఉండొచ్చు.

సదరు కాలేజీలో ఏదైనా సంఘటన జరిగినా పేరు మాత్రం రాసేవారు కాదు. విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా, గొడవ జరిగినా, ఇంకే సంఘటన జరిగినా ఒక కాలేజీలో అని రాసేవారు. పేరు రాస్తే ఆ కాలేజీ వారికి ఎక్కడ కోపం వస్తుందో అని వీరి భయం. సదరు సంఘటనతో యాజమాన్యానికి సంబంధం ఉందా లేదా అనేది వేరే విషయం. కనీసం ఫలానా కాలేజీలో ఫలానా సంఘటన జరిగిందనే వార్తను ప్రజలకు తెలపడం మీడియా కనీస కర్తవ్యం. కానీ కాలేజీ పేరు లేకుండా అతి జాగ్రత్త పడ్డ మీడియా సంస్థలే ఎక్కువ. ఏవో ఒకటి రెండు పత్రికలు కాలేజీల పేరు రాసేవేమో చాలా మందికి తెలియదు.

కొన్ని దశాబ్దాలుగా కార్పొరేట్ కాలేజీల అడుగులకు మడుగులొత్తడమే పనిగా అనేక మీడియా సంస్థలు వాటి సేవలో తరించాయి. కొన్ని మాత్రమే తమ ధర్మాన్ని తాము నిర్వర్తించాయి. బడా బడా మీడియా సంస్థలు కూడా ఈ కాలేజీల మీద ఈగ వాలకూడదనే ఉద్దేశంతో అతి జాగ్రత్తగా వార్తలు కవర్ చేశాయ. కాలేజీ భవనం మీద నుంచి దూకి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లోనూ కాలేజీల పేరు రాయకుండా ఒక కాలేజీ అని రాసిన ప్రముఖ మీడియా సంస్థలు, సామాజిక బాధ్యతను విస్మరించాయి. ప్రకటన డబ్బు వస్తే చాలనే వ్యాపార ధోరణిలో మానవత్వాన్ని మరిచిపోయాయి.

కాలేజీలో ఆత్మహత్య జరిగిందంటే కచ్చితంగా యాజమాన్యమే దోషి కాకపోవచ్చు. వ్యక్తిగత కారణాలతో కాలేజీ ఆవరణలో ఆత్మహత్య చేసుకునీ ఉండొచ్చు. కానీ ఒక సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం కూడా రిపోర్ట్ చేయలేనంత కాసుల కక్కుర్తిని కొన్ని మీడియా సంస్థలు ఇంత కాలం ప్రదర్శిస్తూ వచ్చాయి. కడప నారాయణ కాలేజీలో జరిగిన ఘటన లాంటివి గతంలో కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో చాలా జరిగాయి. ఒక కాలేజీలో… అంటూ పలు మీడియా సంస్థలు తమదైన శైలిలో వార్తను ప్రచురించాయి. ప్రసారం చేశాయి. ఇప్పుడు అలా కుదరకపోవడం ఆ సంస్థలకు బాధాకరంగా ఉండొచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇష్టారాజ్యం కలకాలం చెల్లదు. ఇప్పుడు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com