పెద్ద నోట్ల రద్దు దెబ్బకు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, వాహన కొనుగోళ్లు సహా పలు లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో వివిధ పన్నుల రూపంలో నెలకు సుమారు 2 వేల కోట్ల రూపాయల రాబడికి గండిపడింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తల్లకిందులయ్యాయి. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉద్యోగులకు ఈ నెల జీతం ఇవ్వడం కూడా కష్టమనే ప్రచారం జరుగుతోంది. వారికి నవంబర్ జీతం సగమే చెల్లిస్తారనే ఊహాగానాలు వినవస్తున్నాయి. మిగతా జీతాన్ని వచ్చే నెలతో పాటు కలిపి ఇవ్వడం లేదా పీఎఫ్ ఖాతాలో జమ చేయడం జరగవచ్చనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి దీనిపై అధికారికంగా ప్రతిస్పందన లేదు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా ఈ ప్రచారం నిజమని చెప్పలేదు. అలాగని అబద్ధమనీ చెప్పలేదు. ఇంకా జీతాల చెల్లింపు గురించి ఆలోచించ లేదని, రానున్న రోజుల్లో ఆదాయం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉందని సోమవారం మీడియాతో చెప్పారు. మద్యం విక్రయాలు తగ్గడంతో పన్నుల వసూలు కూడా తగ్గిందని చెప్పారు. అయితే ఉద్యోగులకు సగం జీతమే ఇస్తామని మాత్రం ఆయన అనలేదు.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. పన్నుల రాబడి తగ్గుతుంది. అన్ని రాష్ట్రాలకూ ఇదే పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంది. వచ్చే ఆదాయంలో ఏమాత్రం తేడా వచ్చినా పథకాల చెల్లింపులకు గండి పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలకు బకాయిలు పెండింగులో ఉన్నాయి. మిషన్ భగీరథను పూర్తి చేయాలంటే కేంద్ర సాయం కావాలి. దీనిపై నీతి ఆయోగ్ సానుకూలంగా స్పందించడంతో కొంత ఊరట కలిగింది. ఇక మిషన్ కాకతీయతో పాటు ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర పథకాలకు భారీగా నిధులు కావాలి.
ఈ దశంలో పెద్ద నోట్ల రద్దు పిడుగుపాటే అయింది. సంపన్న రాష్ట్రమని రెండున్నరేళ్ల కిందట గొప్పగా చెప్పుకున్నారు. రానురానూ నిధుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.