అమెరికాలో ఉన్న పరిస్థితులో… రాబోయే రోజుల్లో కావాల్సిన మ్యాన్ పవర్, వినియోగ సామర్థ్యం అంతా భారత్ కేంద్రంగా ఉంటుందన్న అంచనాలో ఏమో కానీ ఇప్పుడు టెక్ దిగ్గజాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులతో వస్తున్నాయి. పెద్ద ఎత్తున లేఆఫ్స్ చేస్తున్న కంపెనీలు.. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా..తమ ప్రాధాన్యతలు మార్చుకుని ఇండియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు ప్రకటించడం అందర్నీ ఆశ్చ్యపరుస్తోంది.
అమెజాన్ ఐదేళ్లలో మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు
అమెజాన్ సంస్థ అనూహ్యమైన ప్రకటన చేసింది. ఇండియాలో అత్యంత భారీగా విస్తరించనున్నట్లుగా ప్రకటన చేసింది. ఈ ఏడాది 14 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసిన అమెజాన్.. త్వరలో మరో 30వేల మందికి గుడ్ బై చెప్పనుంది.అయితే వీరందర్నీ తీసేసింది నష్టాలు వచ్చి కాదు. అమెజాన్‌కు రికార్డు స్థాయి లాభాలు వస్తున్నాయి. ఏఐ మీద పెట్టుబడులు పెట్టాలన్న లక్ష్యం కోసం.. ఈ నిర్ణయం తీసుకుంది. ఆ పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఇండియాలో పెట్టనుంది. ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ.. ఐదేళ్లలో మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులను అమెజాన్ పెట్టనుంది. మొత్తంగా పది లక్షల ఉద్యోగాలు ఇస్తుంది. ఏఐ సహా తమ వ్యాపారాలన్నింటినీ అమెజాన్ విస్తరించనుంది.
మైక్రోసాఫ్ట్ రెండు లక్షల కోట్ల పెట్టుబడులు
మైక్రోసాఫ్ట్ సీఈవో అండ్ చైర్మన్ సత్యనాదెళ్ల ఇండియాకు వచ్చి ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత తమ పెట్టుబడి ప్రణాళికల్ని ప్రకటించారు. దాదాపుగా రెండు లక్షల కోట్లను ఇండియాలో పెట్టుబడిగా పెట్టనున్నారు. ఏఐ హబ్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడ పెడతారు..ఏమిటి అన్న పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ.. మైక్రోసాఫ్ట్ లో నిర్ణయాలు ఆషామాషీగా ఉండవు. అంతా పూర్తి అయిన తర్వాతనే ప్రకటిస్తారు.
ఇప్పటికే గూగుల్ భారీ పెట్టుబడులు
గూగుల్ ఇండియా ఇప్పటికే భారీ ప్రకటనలు చేసింది. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. మార్చిలో గూగుల్ ఏఐహబ్కు విశాఖలో శంకుస్థాపన జరుగుతుంది. ఇప్పటికే భూమి చదును చేసే ప్రక్రియ ప్రారంభమయింది. పనులు ప్రారంభమయ్యే నాటికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
ఇవి మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున టెక్ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను ఇండియాలో ప్రకటిస్తున్నారు. కావాల్సినంత స్కిల్డ్ మ్యాన్ పవర్ అందుబాటులో ఉండటంతో పాటు.. భవిష్యత్ లో భారత ఆర్థిక వ్యవస్థ ఎవరూ ఊహించని విధంగా పరుగులు పెడుతుందన్న అభిప్రాయంతో దిగ్గజం సంస్థలన్నీ ఇండియాలో పెట్టుబడుల వెల్లువకు ప్రాధాన్యమిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఈ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు భారతయువతకు ఆకాశమే హద్దు అవుతుందనడంలో సందేహం లేదు.
