ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటులో రైట్ టు రీకాల్ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ఇది భారత రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎన్నికైన ప్రతినిధి తన విధుల్లో విఫలమైతే లేదా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే, పదవీకాలం ముగియక ముందే వారిని వెనక్కి పిలిచే అధికారం ఉండాని ఈ బిల్లు పెట్టారు. ఈ అధికారం ప్రజాస్వామ్యానికి నిజంగా మేలు చేస్తుందా? లేదా అస్థిరతకు దారితీస్తుందా?
బాధ్యతాయుత రాజకీయాలకు బ్రహ్మాస్త్రం
భారత ప్రజాస్వామ్యంలో ఓటరుకు ఐదేళ్లకోసారి మాత్రమే తన తీర్పును తెలిపే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్‌లో ఎన్నికైన ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేకపోయినా, అవినీతికి పాల్పడినా ఓటరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. రాఘవ్ చద్దా వాదన ప్రకారం, రైట్ టు రీకాల్ అమలులోకి వస్తే ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవారికి ఇది ఒక హెచ్చరికగా మారుతుంది. ఇది ఓటరును కేవలం ఐదేళ్లకోసారి ఓటు వేసే యంత్రంగా కాకుండా, నిరంతరం పర్యవేక్షించే శక్తిగా మారుస్తుంది.
రాజకీయ అస్థిరత – ఒక పెను సవాలు
సిద్ధాంతపరంగా ఇది అద్భుతంగా అనిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో దీని అమలు అనేక సవాళ్లతో కూడుకున్నది. భారత్ వంటి బహుళ పార్టీలు, తీవ్రమైన రాజకీయ వైషమ్యాలు ఉన్న దేశంలో ఈ చట్టం రాజకీయ కక్షసాధింపున కు ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. ఓడిపోయిన అభ్యర్థులు లేదా ప్రత్యర్థి పార్టీలు నిరంతరం రీకాల్ పిటిషన్లతో పాలనను స్తంభింపజేసే అవకాశం ఉంది. ఇది దేశంలో నిరంతరం ఎన్నికల వాతావరణాన్ని సృష్టించి, అభివృద్ధి పనులను పక్కదారి పట్టించవచ్చు. అలాగే, ఒక ఎన్నిక నిర్వహణకు అయ్యే భారీ ఖర్చును దేశ ఆర్థిక వ్యవస్థ పదే పదే భరించడం కష్టసాధ్యం.
అంతర్జాతీయంగా ఫెయిల్
అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఈ విధానం పాక్షికంగా అమల్లో ఉంది. జయప్రకాష్ నారాయణ్ వంటి వారు గతంలోనే దీని గురించి గళమెత్తారు. అయితే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ విధానాన్ని తీసుకురావాలంటే ఓటరు చైతన్యం చాలా అవసరం. కుల, మత సమీకరణాలతో ఓట్లు పడే మన దగ్గర, రీకాల్ ప్రక్రియ కూడా కుల రాజకీయాల చుట్టూ తిరిగే ప్రమాదం లేకపోలేదు.
మార్పు దిశగా సమతుల్య వ్యూహం
రాఘవ్ చద్దా డిమాండ్ చేస్తున్న ఈ హక్కు ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసే అవకాశం ఉన్నప్పటికీ, దీనికి కఠినమైన నిబంధనలు ఉండాలి. ఉదాహరణకు, కనీసం మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాతే రీకాల్‌కు అనుమతించడం, మెజారిటీ ఓటర్లు సంతకాలు చేస్తేనే ప్రక్రియ మొదలుపెట్టడం వంటి రక్షణ కవచాలు ఉండాలి. రైట్ టు రీకాల్ అనేది ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో ఒక గొప్ప అడుగు కావచ్చు, కానీ అది అరాచక రాజకీయాలకు దారి తీయకుండా చూడటం చట్టసభల బాధ్యత. ప్రస్తుతం ప్రైవేటు మెంబర్ బిల్లు వలన.. ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇది ఒకందుకు మంచిదే.
