కేంద్ర బడ్జెట్ 2026-27 లో, సామాన్యుడి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సరసమైన ధరల గృహాల రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నీతి ఆయోగ్ కీలక ప్రతిపాదనలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. బిల్డర్లకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అవకాశం కనిపిస్తోంది.
నీతి ఆయోగ్ చేసిన సిఫార్సుల్లో అత్యంత ప్రధానమైనది సెక్షన్ 80-IBA కింద బిల్డర్లకు 100 శాతం పన్ను మినహాయింపునుపునరుద్ధరించడం. గతంలో అమలులో ఉన్న ఈ వెసులుబాటు గడువు ముగియడంతో, డెవలపర్లు చిన్న, మధ్యతరగతి గృహాల నిర్మాణంపై ఆసక్తి తగ్గించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ మినహాయింపును ఇవ్వడం ద్వారా, బిల్డర్ల నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని బిల్డర్లు నేరుగా కొనుగోలుదారులకు బదిలీ చేయాల్సి ఉంటుంది, తద్వారా మార్కెట్లో ఇళ్ల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం లగ్జరీ ఇళ్ల వైపు మళ్లుతున్న తరుణంలో, ఈ పన్ను రాయితీలు గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని తాకడం వంటి కారణాలతో మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదనలు అమలులోకి వస్తే, 45 లక్షల లోపు విలువైన ఇళ్ల సంఖ్య పెరుగుతుందని, దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త డిమాండ్ ఏర్పడుతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం బిల్డర్లకే కాకుండా, కొనుగోలుదారులకు కూడా హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.4 లక్షలకు పెంచాలని నీతి ఆయోగ్ సూచించినట్లు సమాచారం. ఈ రెండు నిర్ణయాలు ఒకేసారి అమలైతే, నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు కొనుగోలుదారుల పొదుపు పెరుగుతుంది.
