రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు అయిందని సంబరాలు చేస్తున్నారు. ఈ అంశంపై రెండు విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ సంస్థ దేశానికి ఏం చేయలేదని కొంత మంది…. దేశాన్ని కాపాడుతోందని మరికొంత మంది చెబుతున్నారు. అయితే చరిత్రలో ఆరెస్సెస్ గురించి వ్యతిరేక ప్రచారమే ఎక్కువ జరిగింది. ఎంత జరిగినా ఆ సంస్థ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
1925 దసరా రోజున ఆరెస్సెస్ ఏర్పాటు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను 1925 దసరా రోజున కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రారంభించారు. దీన్ని స్వాతంత్ర్య ఉద్యమం కోసం ప్రారంభించలేదు. స్వాతంత్ర్య పోరాటం తమ లక్ష్యం అని చెప్పలేదు. హిందూ సంస్కృతి, జాతీయవాదం, సేవా ఆధారిత స్వయంసేవకుల సంఘంగా ఏర్పాటు అయింది. అయితే చాలా మంది దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర లేదని చెబుతూ ఉంటారు. కానీ హిందూత్వమే లక్ష్యంగా ఏర్పడిన సంస్థ అదే లక్ష్యం కోసం నిరంతరం పని చేస్తోంది.
ఆరెస్సెస్ ..బలమైన భావజాల సంస్థ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా.. వందేళ్ల దేశ చరిత్రలో ఆ సంస్థకు చాలా పేజీలు ఉంటాయి. రాజకీయంగా బీజేపీ ఇప్పుడు దేశాన్ని శాసిస్తోందంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్. దీనికి కారణం ఆ సంస్థకు ఉన్న బలమైన సిద్ధాంతాల పునాదులే. 1947 విభజన సమయంలో RSS స్వయంసేవకులు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, ఇక్కడ నిరాశ్రయులైన హిందువుల కోసం వేలాది క్యాంపులు నడిపారు. తుఫానులు, భూకంపాలు, అల్లర్ల బాధితులకు సహాయం అందించారు. సేవా భారతీ వంటి అనుబంధాల ద్వారా సాయం చేస్తూ వస్తున్నారు. దేశ భక్తి, ఐక్యతను ప్రోత్సహిస్తూ “వసుధైవ కుటుంబకం” అంటే ప్రపంచం ఒక కుటుంబం భావాన్ని ఆరెస్సెస్ అమలుచేస్తుంది. యువత, మహిళలు, రైతులు, గిరిజనుల అభ్యుదయానికి కృషి చేసింది. గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య కార్యక్రమాలు నడుపుతుంది. 1963 రిపబ్లిక్ డే పరేడ్‌లో స్వయంసేవకులు పాల్గొన్నారు.
హిందూ మత అతి వాద సంస్థగా వివాదాలు
హిందూత్వం , జాతీయవాదం కోసమే పుట్టిన సంస్థ కాబట్టి ఆ సంస్థ వాటినే ప్రధాన లక్ష్యాలుగా ఉంచుకుంది. ఈ క్రమంలో ఆ హిందూత్వం, జాతీయవాదం దారి తప్పిందన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బాబ్రీ మసీదు సహా అనేక అంశాల్లో మత విద్వేషాలను ఆరెస్సెస్ రెచ్చగొట్టిందని ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. ముస్లిలంలపై ఎక్కడా లేనంత వ్యతిరేకత చూపిస్తారని అంటారు. ఇది కొన్ని సందర్భాల్లో నిజం అయింది. అందుకే మూడు సార్లు నిషేధానికి గురయింది. హిందూత్వాన్ని అభిమానించడం అంటే.. ముస్లింలను వ్యతిరేకింతచడం అనే ఓ తరం ఆలోచనల వల్ల ఆరెస్సెస్ కు ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో వాదనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముస్లింలను వ్యతిరేకించడం కాదని.. వారంటే వ్యతిరేకత లేదని అంటున్నారు.
ఆరెస్సెస్ పై క్రమంగా మార్పు
అయితే చాలా మంది హిందువుల్లోనూ ఆరెస్సెస్ పట్ల సానిుకూల భావన ఉండదు. కానీ పరిస్థితి మారుతోంది. ఇప్పుడు ఆరెస్సెస్ పై గతంలో ఉన్నంత వ్యతిరేకత లేదు. ఊరూవాడా శాఖలు ఉన్నాయి. అందులో కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు విద్వేషాలు తగ్గించిందని.. సమాజాభివృద్ధికి సాయం చేస్తోందని నమ్మేవారు పెరుగుతున్నారు. చరిత్రలో ఏం నమోదు చేశారో అదే నిజం కాకపోవచ్చు. అందుకే ఆరెస్సెస్ పై సానుకూల భావన పెరుగుతోంది.