దర్శకుడు రాజమౌళి స్ట్రాటజీలు చాలా కొత్తగా ఉంటాయి. ఆయన ప్రతీ రూపాయి స్క్రీన్ కోసమే ఖర్చు పెడతారు. ప్రమోషన్ల కోసం బడ్జెట్ ఏమాత్రం ఉండదు. కనీసం పేపర్, టీవీ యాడ్లు కూడా ఇవ్వరు. తన పేరు, తన బ్రాండ్, తన సినిమానే.. ప్రమోషన్. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా కోసం కూడా ప్రమోషన్ల కు బడ్జెట్ లేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ అంతే. కానీ.. ‘వారణాసి’ కోసం మాత్రం ప్రణాళిక మార్చారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం దాదాపు రూ.75 నుంచి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు టాక్. ఏప్రిల్ 7న ఈ సినిమాని విడుదల చేస్తున్న సంగతి వారణాసిలో హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రకటించారు. అంతకు ముందు టైటిల్ ప్రకటన కోసం ఓ పెద్ద ఈవెంట్ నిర్వహించారు. రిలీజ్కు ముందు ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రచారం నిర్వహించాలన్నది ప్లాన్. అందుకే ఇంత బడ్జెట్.
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాని ఆస్కార్ వరకూ తీసుకెళ్లారు రాజమౌళి. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. ‘వారణాసి’ని సైతం ఆస్కార్ బరిలో నిలపాలన్నది ప్రయత్నం. అందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ‘వారణాసి’ ఇంగ్లీష్ వెర్షన్ ని సైతం రెడీ చేస్తారు. రిలీజ్ కు ముందు హాలీవుడ్ లో ప్రచారం చేస్తారు. ఆస్కార్ ప్రమోషన్లకు వేరే ఖర్చు. రాజమౌళి సినిమా వస్తోందంటే తెలుగునాట ప్రచారం చేయకపోయినా ఫర్వాలేదు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో కొంత ఎఫెక్ట్ పెట్టాలి. విదేశాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా ప్రమోషన్ అవసరం. అందుకే రూ.100 కోట్లు కేటాయించబోతున్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రూపాయి ఖర్చు పెట్టకుండానే తన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేసుకొన్నారు జక్కన్న. అదే రూ.100 కోట్లు పెడితే ఆ వైబ్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
