ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ నెల 28న 12 ప్రముఖ బ్యాంకుల రీజినల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్బీఐ గవర్నర్, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ శంకుస్థాపనతో అమరావతి ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోనున్నాయి.
ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఎన్-10 రోడ్డు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. సభా వేదికపై నుంచి ఒకేసారి అన్ని 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. భూములు ఇప్పటికే నిర్మాణానికి అనుకూలంగా రెడీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం సమయంలో ఈ బ్యాంకులకు స్థలాలు కేటాయించారు. కానీ వైసీపీ వచ్చాక వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంప్రదింపులు చేసి, నిర్మాణాలు జరిపేలా అంగీకరింప చేసింది.
ఈ బ్యాంకులు రాష్ట్ర ప్రధాన కార్యాలయాలుగా పనిచేస్తాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్న కార్యాలయాలు అమరావతికి మారనున్నాయి. రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. నగదు చలామణి, లోన్లు, కార్పొరేట్ లావాదేవీలు సులభమవుతాయి. ఈ బ్యాంకుల ప్రాజెక్టు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు.