అసెంబ్లీలో ముఖ్యమంత్రిపైనా, సాటి ఎమ్మెల్యేపైనా నోరు పారేసుకున్నారని, సభా సంప్రదాయాల్ని కించపర్చేలా వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆమెకు ముందూ ఆమె తర్వాత కూడా అసభ్య పదజాలాలు వాడిన టీడీపీ ఎమ్మెల్యేల సంగతి ఏంటని వైకాపా నేతలు ప్రశ్నించారనుకోండి.. ఆ సంగతి ప్రస్తుతం అప్రస్తుతం. అయితే, ఇదంతా కుట్రపూరిత చర్య అనీ రోజా ఆరోపిస్తూ వస్తున్నారు. ఫలితం సంగతి కాసేపు పక్కనపెడితే.. మరోపక్క, కోర్టుల్లోనూ న్యాయపోరాటం చేశారు. అయితే తాజాగా మరో 12మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చను కోరుతూ వైకాపా ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టినప్పుడు మూడు రోజుల పాటు సభా కార్యక్రమాల్ని అడ్డుకుంటూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. అయితే ఈ నిరసనను విరమించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరినా వారు వినలేదు. దీంతో వైకాపా సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్.. ఈ సభ్యుల ప్రవర్తనపై సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు వీరంతా ఈ నెల 25, 26 తేదీల్లో ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై తమ వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
వారి లిస్ట్ ఈ విధంగా ఉంది…
1. కొడాలి నాని
2. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
3. దాడిశెట్టి రాజా
4. కొరుముట్ల శ్రీనివాసులు
5. చిర్ల జగ్గిరెడ్డి
6. రాచమల్లు శివప్రసాదర్ రెడ్డి
7. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
8. ఆళ్ల రామకృష్ణారెడ్డి
9. ముత్యాల నాయుడు
10. సునీల్ కుమార్
11. కిలివేటి సంజీవయ్య
12. కంబాల జోగులు
అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఎన్నిసార్లు మొత్తుకున్నా స్పందించని స్పీకర్, ప్రతిపక్ష నేతపైనా, సభ్యులపైనా అసభ్య పదజాలంతో దూషించిన నేతలపైనా చర్యలు తీసుకోమంటే మాత్రం స్పందించిన స్పీకర్, తమ మీదనే ఎందుకు కుట్రపూరితంగా ఇలాంటి చర్యలకు దిగుతున్నారంటూ వైకాపా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. 12మందిని కాదని, మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఇదేనా నైతికత, ప్రజల ఆకాంక్షలను అసెంబ్లీలో ప్రతిబింబిస్తే ప్రతిపక్షం గొంతు నులిపేస్తారా అని ధ్వజమెత్తుతున్నారు.
అయితే ఈ విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా అసెంబ్లీలో స్పీకర్ తీసుకునే నిర్ణయాల ప్రకారమే అక్కడ చర్యలుంటాయి. ఈ విషయంలో నైతికతా, అనైతికత, దుర్మార్గం, పక్షపాత దోరణి వంటి మాటలకు రికార్డుల్లో చోటు ఉండదు! కాబట్టి పరిస్థితులు చూస్తుంటే… వైకాపా తరుపున జగన్ తర్వాత గట్టిగా మాట్లాడే రోజాని, టీడీపీ నేతలని కాస్తైనా కంట్రోల్ చేయగల నేతలను ఏదో రూపేనా బయటకు పంపేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోజులన్నీ ఒకేలా ఉండవు, ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి… వ్యక్తులు మారిన సిస్టం మారదు, వ్యక్తులే సిస్టమెటిక్ గా ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా… పరిస్థితులను బట్టి చూస్తుంటే… రోజా తర్వాత ఈ 12 మందిది కూడా అదే పరిస్థితి అని కొందరు జోస్యం చెబుతున్నారు!! మరో వారం రోజులు ఆగితే ఫలితం తేలిపోనుంది!!