రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న తీవ్ర వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శల కారణంగా కొంత అయోమయం నెలకొంది. ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లు దీనిలో కొన్ని లోపాలు, సమస్యలు ఉన్నప్పటికీ ఎవరూ ఊహించని పెద్ద లాభం కూడా ఉంది.
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రప్రభుత్వం ఆంధ్రాలో 7 జిల్లాలని, తెలంగాణాలో 9 జిల్లాలని వెనుకబడినవిగా గుర్తించి వాటి అభివృద్ధికి ఒక్కో జిల్లాకి ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున నిధులు విడుదల చేస్తోంది. వాటి కోసం తెలంగాణాకి రూ.450 కోట్లు అందాయి. ఇప్పుడు హైదరాబాద్ తప్ప మిగిలిన 9 జిల్లాలని పునర్విభజించి కొత్తగా మరో 17జిల్లాలు ఏర్పాటు చేస్తునందున, ఒక్కో జిల్లాకి రూ.50 కోట్లు చొప్పున ఇక నుంచి రూ.1,300 కోట్లు అందుతాయి. అంటే రాష్ట్రానికి అదనంగా ఏడాదికి రూ.850 కోట్లు అందబోతున్నాయన్న మాట! గతంతో పోలిస్తే ఇప్పుడు జిల్లాలు జనాభాపరంగా, భౌగోళికంగా చిన్నవిగా ఉండబోతున్నందున కేంద్రం నుంచి అందబోయే సహాయంతో జిల్లాలని అభివృద్ధి చేసుకోవచ్చు.
రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ పట్టణాలని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం అదనంగా నిధులు సమకూర్చబోతోంది. జనాభా, భౌగోళిక పరిధి, అభివృద్ధికి గల అవకాశాలు వంటి కొన్ని నిర్దిష్టమైన అర్హతల ప్రాతిపదికగా రాష్ట్రంలో ఈ రెండు పట్టణాలని ఈ పధకం క్రింద ఎంపిక చేసింది. కనుక ఈ పునర్విభజన వలన ఆ రెండు పట్టణాలు ఆ హోదా కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది.
అదేవిధంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అమృత్’ పధకం క్రింద ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడ (మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు) ఎంపిక అయ్యాయి. ఈ పునర్విభజన కారణంగా అవి ఆ అమృత్ పధకానికి అర్హత కోల్పోకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది.
జిల్లాల పునర్విభజన ప్రజలకి, ప్రతిపక్షాలకి ఆమోదయోగ్యంగా ఉండాలి. పరిపాలనా సౌలభ్యంగా ఉండాలి. అదే సమయంలో కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ రెండు పధకాలకి అర్హత కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం దక్కుతుంది, రాష్ట్రానికి, ప్రజలకి కూడా మేలుకలుగుతుంది. బహుశః రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే జిల్లాల పునర్విభజన చేస్తోందని ఆశిద్దాం.