సినిమా అంటే ఎలా ఉండాలి?
పోకిరిలా ఉండాలి..
హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి?
పండులా ఉండాలి..
డైలాగులు ఎలా ఉండాలి?
దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాలి..
పోకిరి చేసింది అదే. టాలీవుడ్ కి మతిపోగొట్టిన సినిమా పోకిరి. హీరోలంతా.. `ఓసారి ఇలాంటి క్యారెక్టరైజేషన్ ట్రై చేయాలి` అని కమిట్ చేయించిన సినిమా పోకిరి. అందుకే తెలుగునాట బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసింది. ఆ సినిమా వచ్చి ఈరోజుకి పదిహేనేళ్లు.
మహేష్, పూరి కెరీర్లోనే కాదు… తెలుగు చలన చిత్ర చరిత్రలోనూ మిగిలిపోయే పేరు పోకిరి. హీరోని చూపించిన విధానం, ఆ డైలాగులు, చివర్లో ట్విస్టూ… వేటికవే! మహేష్‌ని ఆ తరహా పాత్రలో ఇది వరకూ చూడలేదు. ఇంతకు ముందూ చూడలేం. పోకిరి కోసమే మహేష్ పుట్టాడా? ఆ కథ మహేష్ కోసమే పుట్టిందా.? అన్నట్టు మ్యాజిక్ జరిగిపోయింది.
నిజానికి ఈ కథలో హీరో.. మహేష్ కాదు. పూరి ఆలోచనలు వేరు. ఈ సినిమాని రవితేజతో చేద్దామనుకున్నాడు. రవితేజ కూడా `ఓకే` అనేశాడు. కానీ అదే సమయంలో.. రవితేజకు `నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్` లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ కథంటే రవితేజకు చాలా ఇష్టం. తనలోని నటుడ్ని బయటకు తీసుకుస్తుందన్న ఆశతో.. `పోకిరి`ని పక్కన పెట్టాడు. జగన్ మనవాడే కదా.. మళ్లీ చేసుకుందాం అనుకుని.. ఆటోగ్రాఫ్ కి ఫిఫ్ట్ అయిపోయాడు.
కానీ ఎవరి కోసమూ ఆగే రకం కాదు పూరి. ఈ కథని సోనూసూద్ తో చేసేద్దామనుకున్నాడు. ఆ సినిమాతోనే సోనూని హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నాడు. కానీ సోనూ కోసం అంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలెవరూ సిద్ధంగా లేరు. కాబట్టి… ఆ ప్రయత్నం మొగ్గలోనే తుంచేశాడు పూరి.
మహేష్‌కి ఓసారి కథ చెప్పే అవకాశం వచ్చింది. ఇది వరకు `ఇడియట్` కథని ముందు మహేష్ కే వినిపించాడు పూరి. ఆ కథ మహేష్ కి నచ్చలేదు. కానీ సినిమా సూపర్ హిట్టు. ఆ కన్సర్స్తో… మహేష్ పూరిని పిలిపించాడు. తొలి సిట్టింగ్ లోనే కథ ఓకే. కానీ అప్పటికి టైటిల్… `ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ`. హీరో సిక్కు. మహేష్ చెప్పిన ఒకే ఒక్క మార్పు. సిక్కు నేపథ్యం తీసేయ్యమని. దానికి పూరి ఓకే అన్నాడు. ఎప్పుడైతే సిక్కు నేపథ్యం లేదో.. టైటిల్ కూడా మారిపోయి.. పోకిరి అయ్యింది.
ఈ సినిమా కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. ఆయాషా టాకీయా ఓ ఆప్షన్. మహేష్ పక్కన బాగా లావుగా కనిపిస్తుందని… పార్వతీ మెల్టన్‌ని ఎంచుకున్నారు. చివరికి ఇలియానా ఫిక్సయ్యింది. ఈసినిమాతో ఇలియానా స్టార్ అయిపోయింది. ప్రతీ షాటూ.. సింగిల్ టేక్ కే ఓకే అయిపోయేదట. మహేష్ అంతలా పండు పాత్రలో లీనమైపోయాడు. అందుకే ఈ సినిమా కేవలం 70 రోజుల్లో పూర్తయిపోయింది. అప్పటి వరకూ ఉన్న ఇండ్రస్ట్రీ రికార్డుల్ని పోకిరి తిరగరాసింది. తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయి… అక్కడా సూపర్ హిట్టయ్యింది.