ఇసుకలో చంద్రబాబు నాయుడు తప్పటడుగులు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఇసుక సరఫరాను ఆన్ లైన్ ద్వారా అమ్మబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆకట్టుకొన్నారు. ఇసుక సరఫరా కోసం దేశంలో అటువంటి ఆన్ లైన్ విధానం ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రభుత్వంగా ఆయన మంచిపేరు సంపాదించుకొన్నారు. కానీ అప్పటి నుండి ఆయన వేసిన ప్రతీ అడుగు తప్పటడుగులే అయ్యేయి.

అయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన ఇసుక విధానం వలన రాష్ట్రంలో అకస్మాత్తుగా ఇసుకకి కరువు వచ్చిపడింది. అధికార పార్టీలోని ఇసుక బకాసురులు కొందరు ఆ ఇసుకనంతా మింగేస్తున్నారని ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెడుతున్నా ముఖ్యమంత్రి వారి ఆరోపణలను తేలికగా కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆ ఆరోపణలలో నిజానిజాలు ఎలాగ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఇళ్ళు, అపార్టుమెంటులు కట్టుకోవాలనుకొన్నవారందరికీ గత 21 నెలలుగా ఇసుక దొరకకపోవడంతో చాలా నరకం అనుభవిస్తున్నారు. ఇసుక దొరకని కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఇళ్ళు, అపార్టుమెంటుల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఆ కారణంగా బ్యాంకుల నుండి రుణాలు తెచ్చుకొని ఇళ్ళు నిర్మించుకొనే మధ్యతరగతివారు నానా ఇబ్బందులు పడుతుంటే, నిర్మాణ రంగంలో ఉన్నవారు తీవ్రంగా నష్టపోయారు.

తాము ప్రవేశపెట్టిన ఇసుక విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని, దాని వలన రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రెండువేల కోట్లకు పైగా నష్టం వచ్చిందని ఒక మంత్రిగారే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. ఆ విధానంలో లోపాలను సవరించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొన్ని రోజుల క్రితమే మరో కొత్త ఇసుకవిధానం ప్రకటించింది. పాత విధానంలో లోపాల వలన ప్రభుత్వానికి చాలా నష్టం వచ్చింది కనుక ఆ నష్టాలను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానంలో ఇసుక త్రవ్వకాలకు ధరను బారీగా పెంచేసిందే తప్ప ఇతర లోపాలను సవరించలేదు. ఆకారణంగా రాష్ట్రంలో ఇసుక బంగారంతో సమానమయిపోయింది. ఇసుకపై నియంత్రణ ఇంకా పెరిగిపోవడంతో ఇళ్ళు కట్టుకొంటున్న చిన్నా, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే చాలా ఎక్కువ మొత్తాలు దళారులకు, ఇసుక సరఫరా చేసే లారీల యజమానులకు చెల్లించుకొని ఇసుకను కూడా దొంగచాటుగా తెచ్చుకొని ఇళ్ళు కట్టుకోవలసిన దుస్థితి దాపురించింది. ఇక పెద్దపెద్ద అపార్టుమెంటులు నిర్మించే బిల్డర్ల పరిస్థితి ఇంకా అద్వానంగా మారింది.

తమ ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమయిన ఈ విధానాలతో రాష్ట్రంలో ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారనే విషయం మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెవికెక్కించుకొని, దానిని చక్క దిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి కూడా మళ్ళీ మరో పెద్ద తప్పు చేయడానికి సిద్దం అవుతున్నట్లున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై రాష్ట్రంలో ప్రజలకు ఇసుకను పూర్తిగా ఉచితంగా సరఫరా చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. ఆ ప్రతిపాదనను ఒక కడప జిల్లా కలెక్టర్ తప్ప మిగిలిన జిల్లాల కలెక్టర్లు అందరూ సమర్ధించినట్లు తెలుస్తోంది.

ఇంతవరకు ఇసుకపై అతి నియంత్రణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా తన నియంత్రణను వదులుకొంటే దాని వలన ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టబోయే ఈ విధానంలో ఇసుకను యదేచ్చగా తవ్వుకోవడానికి అనుమతిస్తే, రాష్ట్రంలోని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం సంస్థలు, పెద్దపెద్ద కంపెనీలు బారీ యంత్రాలతో తవ్వుకొనిపోతాయి. దాని వలన సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇంకా నష్టపోతారు. పైగా ఇరుగుపొరుగు రాష్ట్రాలలో ఇసుకపై ప్రభుత్వ నియంత్రణ ఉంది కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా భారీ స్థాయిలో మొదలయిపోవచ్చును. ఆవిధంగా ఇసుక అక్రమరవాణా జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటామని ముఖ్యమంత్రి చెపుతున్నప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాదని అందరికీ తెలుసు.

అపార రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న చంద్రబాబు నాయుడు సైతం ఈవిధంగా ఇసుకలో తప్పటడుగులు వేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే ఆయన ప్రభుత్వం ఇసుక మాఫియాలో కూరుకుపోయిందనే అపవాదు ఏర్పడింది. దానిని తొలగించుకొనే ప్రయత్నంలో తీసుకోబోతున్న నిర్ణయం కూడా మళ్ళీ కొత్త సమస్యలకి, విమర్శలకి అవకాశం కల్పించేదిగా కనబడుతోంది. ఇన్ని దశాబ్దాలలో ఏనాడూ ఇసుక విషయంలో ఇన్ని సమస్యలు, విధానపరమయిన లోపాలు ఎదురవలేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఎదురవుతుండటం వలన ఆయన ప్రభుత్వమే తీరని అప్రదిష్ట మూటగట్టుకొంటోంది. సామాన్య ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. కనుక ఇప్పటికయినా బాగా ఆలోచించి సరయిన విధానం ప్రవేశపెడితే మంచిది లేకుంటే మళ్ళీ సమస్యలు తలెత్తితే, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఆవిధంగా చేస్తోందని ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close