లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎన్ని సార్లు గడువు పొడిగించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. కనీసం పది వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే.. ఇప్పటి వరకూ 1900 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. 6.87 లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ ేచశారు. మొత్తంగా ఎల్ఆర్ఎస్ కోసం పాతిక లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అంటే ఇంకా 19 లక్షల దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు ఎప్పటికైనా తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలనే కోరుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం వారు ముందుకు రాలేదు. చాలా మందికి డబ్బులు సమస్య కాదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కడతారు. కానీ సాంకేతిక సమస్యలు, లంచాలు, అధికారుల వేధింపుల వల్లనే ముందడుగు వేయలేకపోతున్నారు. అదే సమయంలో సాంకేతిక సమస్యలు ,OTP వెరిఫికేషన్, పేమెంట్ ఎర్రర్స్, ఆన్లైన్ పోర్టల్లో లోపాలు ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. వాటిని పరిష్కరించలేకపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సైట్ ఇన్స్పెక్షన్లు ,ఫైనల్ అప్రూవల్స్ ఆలస్యం అవుతున్నాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీ LRSని ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఫీజులు విధించడం వల్ల ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది. ప్లాట్ యజమానులు, రెగ్యులరైజేషన్ చేయకపోయినా తమ ఆస్తులను విక్రయించవచ్చని లేదా వాడుకోవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం ఫీజులను తగ్గించడం, ప్రక్రియను సరళీకృతం చేయడం,, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వంటి చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఈ సమస్య ఇలాగే ఉంటుంది.