బాణసంచా తయారీ కేంద్రాలు, నిల్వకేంద్రాలు అత్యంత ప్రమాదకరమైన జోన్లుగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న ఏపీలో వేట్ల పాలెంలో ఘోర దుర్ఘటన జరగ్గా గంటల్లోనే నాగపూర్లో మరోకొటి అలాంటి ప్రమాదమే జరిగింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా కటోల్ తాలూకా రావుల్గావ్లో ఉన్న బాణసంచా తయారీ, గోడౌన్ పరిశ్రమలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ఒక యూనిట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాద సమయంలో అక్కడ సుమారు 20 మంది కార్మికులు మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషాద ఘటనతో కటోల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాణసంచా మాత్రమే కాకుండా..ఈ సంస్థలో ఇతర పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన పేలుడు పదార్థాలు కూడాతయారు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అతి ప్రమాద సంస్థలపై నిఘా తక్కువగా ఉండటంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.
