బడా హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయటమే కష్టంగా ఉంది. హీరోయిన్స్ పరిస్థితి వేరు. వీళ్లకి చేతినిండా సినిమాలే. కాల్షీట్లు సర్దుబాటు చేసే సూత్రం తెలియాలంతే. అందుకే ఈ యేడాది కూడా స్టార్ హీరోయిన్లు ఎడా పెడా సినిమాలు చేసేశారు. కొందరు హిట్ కొట్టారు. మరికొందరు డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు. శృతి హాసన్ లాంటి ఒకరిద్దరు ఈ ఏడాది తెరపై సందడి చేయనే లేదు. 2025కి శుభం కార్డు పడుతున్న తరుణంలో టాప్ హీరోయిన్ల పోగ్రెస్ కార్డు ఒక్కసారి పరిశీలిస్తే…
స్టార్ హీరోయిన్స్ లో ఒకప్పుడు నంబర్ వన్ రేసులో ఉండేది సమంత. స్టార్ హీరోలతో, కమర్షియల్ సినిమాల్లో సామ్ ఫిక్స్డ్ గా ఉండేది. అలాంటిది ‘ఖుషి’ మూవీ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకుంది. దాదాపు రెండేళ్ల తరువాత సామ్ చేసిన సినిమా ‘శుభం’. తన సొంత నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీలో సామ్ గెస్ట్ రోల్ లో మెరిసింది. ప్రస్తుతం సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ చేస్తోంది. తానే నిర్మాత. అప్పుడప్పుడూ సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఫ్యాన్స్ కి టచ్లో ఉంటోంది. ఈమధ్యే రెండో పెళ్లి కూడా చేసుకొని, కొత్త ప్రయాణం ప్రారంభించింది. 2026 లో సామ్ మరిన్ని సినిమాలు చేయాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక ఈ ఏడాది మొత్తంగా 6 సినిమాలతో సందడి చేసింది. వీటిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు కావటం గమనార్హం. గత ఏడాది పుష్ప 2 తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టిన రష్మిక ఈ ఏడాది ప్రారంభం లోనే ‘చావా’ తో మరో సూపర్ హిట్ కొట్టింది. తరువాత సల్మాన్ తో ‘సికిందర్’ చేసింది. సికిందర్ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తరువాత `కుబేర’ తో హిట్ అందుకుంది. ఈ సినిమాలో రష్మిక నటనకి ప్రశంసలు లభించాయి. హిందీలో ‘థామా’ తో థియేటర్స్ లోకి వచ్చింది. ఇది కూడా రష్మిక కి నిరాశ మిగిల్చింది. వెంటనే ‘గర్ల్ ఫ్రెండ్`తో మరోసారి పాస్ మార్కులు తెచ్చుకొంది. ఈ సినిమాతో రష్మిక వ్యక్తిగతంగానూ బాగా కనెక్ట్ అయ్యింది.
శ్రీలీల బ్రేక్ తరువాత కిస్సిక్ పాటతో ఫామ్ లోకి వచ్చి ఈ ఏడాది నితిన్ తో ‘రాబిన్ హుడ్’ , రవి తేజతో ‘మాస్ జాతర’, గాలి కిరీటితో ‘జూనియర్’ సినిమాలు చేసింది. ఇవేవీ శ్రీలీల కి విజయాన్ని అందించలేదు. దాంతో ఈ ఏడాది కూడా యధావిధిగా ఫ్లాప్ లతో ముగించింది శ్రీలీల. సీనియర్ హీరోయిన్ అనుష్క లాంగ్ గ్యాప్ తరువాత ‘ఘాటీ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసింది. కానీ స్వీటీకి ‘ఘాటీ’ నిరాశే మిగిల్చింది. క్రిష్ పై నమ్మకంతో ఘాటీ పై చాలా ఆశలు పెట్టుకుంది అనుష్క. తన ఆశలు ఫలించక పోయేసరికి సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తమన్నా ఎక్కువగా ఈ మధ్య ఐటెం సాంగ్స్ లోనే కనిపిస్తోంది. కానీ ఈ ఏడాది తెలుగులో ‘ఓదెల 2 ‘ తో లేడీ అఘోరాగా ఒక కొత్త ప్రయత్నం చేసి ఫరవాలేదనిపించుకుంది. దీనితో పాటు కొన్ని హిందీ వెబ్ సిరీస్, సినిమాలతో , ఐటెం సాంగ్స్ తో అలరించింది. కీర్తి సురేష్ ఈ ఏడాది పెద్దగా మెప్పించలేకపోయింది. కేవలం OTT కే పరిమితం అయిపోయింది. ‘ఉప్పు కప్పురంబు` ఓటీటీలో వచ్చింది. ‘రివాల్వర్ రీటా` తుస్సుమంది. 2026 లో కీర్తి నుంచి కొన్ని క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. ఈసారి హిట్ కొడుతుందేమో చూడాలి. రాశిఖన్నా ‘తెలుసు కదా’ మూవీతో వచ్చినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. రాశి ఖన్నా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేస్తోంది. రాశీ ఆశలన్నీ ఉస్తాద్ పైనే ఉన్నాయి. నిధి అగర్వాల్ ఈ ఏడాది రెండు భారీ ప్రాజెక్ట్స్ తో అలరించింది. పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లుస తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి.. తరువాత ప్రభాస్ తో రాజా సాబ్ మూవీతో సందడి చేయనుంది. రాజాసాబ్ హిట్టైతే నిధి కెరీర్ ముందుకు వెళ్తుంది.
