ఒకట్రెండు హిట్లు చూసుకొని మురిసిపోవడం తప్ప… 2025లో టాలీవుడ్ సాధించింది ఏం లేదు. ప్రతీ యేటా విజయాల శాతం కేవలం 10 మాత్రమే. ఎలాగైనా ఈ పర్సంటేజీ పెంచాలని చిత్రసీమ కష్టపడుతూనే ఉంది. కానీ ఫలితం మాత్రం రావడం లేదు. నానాటికీ తీసికట్టులా మారిపోతోంది. ఈ యేడాది అటూ ఇటుగా 200 సినిమాలొచ్చాయి. పది శాతం హిట్ రేషియో చూసుకొన్నా కనీసం 20 హిట్లయినా ఉండాలి. కానీ లెక్కలో తేలినవి పదో… పరకో. కొన్ని సినిమాలు పోస్టర్ల వరకే హిట్టు. బ్రేక్ ఈవెన్ సాధించక పోయినా సక్సెస్ మీట్లు పెట్టుకొని, ఉత్తుత్తి సంబరాలు చేసుకొన్న సినిమాలెన్నో. జనవరి నుంచి డిసెంబరు వరకూ చూస్తే – నిర్మాతలకు కాసులు కురిపించిన సినిమాలు ఒకటో రెండో కనిపిస్తాయి. మిగిలినవి పేరుకు మాత్రమే హిట్టు. పరిస్థితి ఇలానే కొనసాగితే.. పెద్ద నిర్మాతలు, పేరున్న సంస్థలు కూడా సినిమాలు తీయడానికి వెనుకంజ వేయడం ఖాయం.
జనవరిలో సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు మిశ్రమ ఫలితాలు తీసుకొచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ ఫ్లాపుల లిస్టులో చేరిపోయింది. ‘డాకూ మహారాజ్’ హిట్ టాక్ సంపాదించుకొన్నా, నిర్మాతలకు బయ్యర్లకూ లాభాల్ని మాత్రం తీసుకురాలేకపోయింది. ఈ సంక్రాంతిని గట్టెక్కించిన ఘనత మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’కే దక్కుతుంది. అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ మంచి ఫలితాల్ని తీసుకొచ్చింది. వెంకీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇది. ‘గేమ్ ఛేంజర్’తో పోయినదంతా దిల్ రాజు ఈ సినిమాతో రాబట్టుకోగలిగారు.
సంక్రాంతి సీజన్ తరవాత ‘తండేల్’ వరకూ టాలీవుడ్ కి మరో హిట్ దక్కలేదు. నాగ చైతన్య – సాయిపల్లవి జంట బాక్సాఫీసుని మెప్పించి, ఈ సినిమాను క్లీన్ హిట్ గా నిలిపారు. ఈ హిట్ తో టాలీవుడ్ కొంత ఊపిరి తీసుకోగలిగింది. ఐపీఎల్ ప్రభావం టాలీవుడ్ పై ఈసారి కూడా గట్టిగా పడింది. ఐపీఎల్ ఎఫెక్టుతో వేసవిలో పెద్ద సినిమాలేం రాలేదు. ‘కోర్ట్’ మినహా ఇస్తే… పెద్దగా మెరుపులేం లేవు. ‘కోర్ట్’ మాత్రం చిన్న సినిమాలకు కొండంత భరోసా ఇచ్చింది. ‘ఈ సినిమా నచ్చకపోతే నా తరవాతి సినిమా చూడొద్దు’ అన్న నాని బోల్డ్ స్టేట్మెంట్ ఈ సినిమాకు కావల్సినంత ప్రచారం మోసుకొచ్చింది. అదృష్టం కొద్దీ ‘హిట్ 3’ కూడా ఓకే అనిపించింది. రక్తపాతం ఎక్కువై ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడ్డానికి కాస్త భయపడ్డారు. లేదంటే ఇంకా మంచి వసూళ్లే వచ్చేవి.
అయితే ఆ తరవాత నెలల తరబడి టాలీవుడ్ హిట్టు కోసం పడిగాపులు కాయాల్సివచ్చింది. ఆశలు పెట్టుకొన్న సినిమాలు బోల్తా కొట్టడం, పలు కారణాల వల్ల వాయిదా పడడం వల్ల బాక్సాఫీసు దగ్గర కళ లేకుండా పోయింది. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల నుంచి సినిమాలు రాకపోవడం కూడా పెద్ద లోటుగా మారిపోయింది. శేఖర్ కమ్ముల ‘కుబేర’ బాక్సాఫీసుకు ఊరట కలిగించింది.
2025 పవన్ కల్యాణ్ అభిమానులకు మిశ్రమ ఫలితాల్ని తీసుకొచ్చింది. అనేక అవాంతరాల తరవాత విడుదలైన ‘హరిహర వీరమల్లు’ నిరాశ పరిచింది. వీఎఫ్ఎక్స్ అయితే ట్రోలింగ్ కి గురైంది. అయితే ‘ఓజీ’తో లెక్క సరి చేశాడు వవన్ కల్యాణ్. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, వవన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ‘మిరాయ్’తో తేజా సజ్జా ఖాతాలో మరో హిట్ పడిపోయింది. వరల్డ్ బిల్డింగ్, వీఎఫ్ఎక్స క్వాలిటీ విషయంలో ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస ఫ్లాపులకు బ్రేక్ వేసిన సినిమా ఇది. యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ అనూహ్య విజయాన్ని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. హీరోలు లేకపోయినా సినిమాని నిలబెట్టవచ్చు అని నిరూపించిన సినిమా ఇది. యానిమేషన్ రంగానికి ఊపు తెచ్చిన సినిమా ఇది.
ఈ యేడాది డబ్బింగ్ సినిమాలేం ఆడకపోవడం మరో షాక్. భారీ అంచనాలతో వచ్చిన ‘కూలీ’, ‘వార్ 2’ కూడా నిరాశ పరిచాయి. ‘కాంతార చాప్టర్ 1’ మాత్రం తెలుగు నాట కూడా మంచి వసూళ్లు అందుకొంది. చిన్న సినిమాల్లో మాడ్ 2, లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, రాజు వెడ్స్ రాంబాయి, ప్రీ వెడ్డింగ్ షో మెరిశాయి. ముఖ్యంగా లిటిల్ హార్ట్స్ టాక్ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచింది. రూపాయికి నాలుగు రూపాయలు లాభాలు తెచ్చిన సినిమా ఇది. డిసెంబరులో వచ్చిన ‘అఖండ 2’ ఫైనల్ రిజల్ట్ ఇంకా తేలాల్సివుంది.
మొత్తంగా హిట్ అని గర్వంగా చెప్పుకొనే సినిమాలు పట్టుమని పది కూడా లేవు. ఈ రిజల్ట్స్ కచ్చితంగా కంగారు పెట్టేవే. వరల్డ్ బిల్డింగ్, పాన్ ఇండియా మోజు, కాంబినేషన్ల పై క్రేజ్ తగ్గించుకొని, కంటెంట్ పై శ్రద్ద పెట్టాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.
