ఏడాదికి 100 సినిమాలొస్తే…. అందులో విజయవంతం అయ్యేవి కేవలం 10 మాత్రమే. 2025లో ఈ సక్సెస్ రేషియో మరీ తక్కువగా ఉంది. చివర్లో కొన్ని ఊరడింపు విజయాలు దక్కాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు నిలబడ్డాయి. అదే.. బాక్సాఫీసుకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. 2026లో మంచి ఓపెనింగ్ కోరుకొంటోంది టాలీవుడ్. దానికి తగ్గట్టుగానే సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎలా చూసినా.. సంక్రాంతి సీజన్ కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఆ తరవాత కూడా బాక్సాఫీసు సందడిగానే ఉండబోతోంది. ఎందుకంటే 2026లో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు క్యూలో ఉన్నాయి.
వేసవిలో పెద్ది, పారడైజ్, డెకాయిట్ లాంటి ఆసక్తికరమైన సినిమాలున్నాయి. పెద్దిపై మెగాఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకొన్నారు. బుచ్చిబాబు మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడని గట్టిగా నమ్ముతున్నారు. దానికి తోడు గ్లింప్స్, చరణ్ లుక్స్, చికిరి పాట అన్నీ ఫ్యాన్స్ కి నచ్చేశాయి. సుకుమార్ అండ – దండ ఈ సినిమాపై ఉన్నాయి. సో.. ఈ వేసవి పెద్దిదే అనడానికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మార్చిలోనే నాని పారడైజ్ వస్తోంది. నాని సినిమాలు ఈమధ్య గన్ షాట్ గా హిట్ అవుతున్నాయి. పారడైజ్ లో నాని లుక్స్ వేరే రేంజ్ లో కనిపిస్తున్నాయి. మోహన్ బాబు విలన్ గా కనిపించడం మరో ప్రత్యేకత. శ్రీకాంత్ ఓదెల క్రియేట్ చేసిన వరల్డ్ కూడా కొత్తగా ఉండబోతోంది. ప్యారడైజ్ తో నాని మరో మెట్టు ఎక్కడం ఖాయం. ఆడవి శేష్ పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో కనిపించబోతున్న చిత్రం డెకాయిట్. ఈ సినిమా టీజర్ సర్పైజ్ చేసింది. కన్నెపెట్టరో.. పాటైతే దుమ్ము లేపుతోంది. వేసవిలో ఈ మూడు సినిమాల ఇంపాక్ట్ గట్టిగా ఉండబోతోంది.
ఈ యేడాది ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకటి రాజాసాబ్ అయితే, మరోటి ఫౌజీ. హను రాఘవపూడి ‘సీతారామం’తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు. ఆ ఫామ్ ఈ సినిమాతోనూ కొనసాగిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. ఈ యేడాది చివర్లో ఫౌజీ చూడొచ్చు. అల్లు అర్జున్ – అట్లీ క్రేజీ కాంబో సృష్టించే మ్యాజిక్ కూడా ఈ యేడాదే చూడబోతున్నాం. ఇద్దరూ కలిసి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. ఈ సినిమాలో విజువల్స్… ఇది వరకెప్పుడూ చూడని విధంగా ఉంటాయని ఇన్ సైడ్ వర్గాలు ఊరిస్తున్నాయి. బడ్జెట్ పరంగానూ పెద్ద సినిమానే. అన్నీ అనుకొన్నట్టు జరిగితే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ కూడా ఈ యేడాది చూడొచ్చు. ఏమైనా అనుకోని అవాంతరాలు వస్తే తప్ప 2026లోనే ఈ సినిమా రావడం ఖాయం. కాకపోతే.. నిర్మాతలు ఓ అప్ డేట్ ఇవ్వాల్సి ఉంది. ఇక పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఈ యేడాదే రాబోతోంది. ‘ఓజీ’తో తన అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు పవన్. హరీష్ శంకర్ పవన్‌కు వీర భక్తుడు. ఫ్యాన్స్‌ని అలరించేలా సినిమా ఎలా తీయాలో తనకు బాగా తెలుసు. సో… ‘ఉస్తాద్’ కూడా తప్పు చేయకపోవొచ్చు.
2025 విజయ్ దేవరకొండకు పెద్దగా కలిసి రాలేదు. కానీ 2026లో మాత్రం కమ్ బ్యాక్ గట్టిగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ‘రౌడీ జనార్థన’ ఈ యేడాదే వస్తోంది. టైటిల్ గ్లింప్స్ ఓ లెవల్ లో ఉంది. అందులో విజయ్ లుక్స్, డైలాగ్ డెలివరీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ సినిమాతో హిట్టు కొట్టి తీరతామని నిర్మాత దిల్ రాజు కూడా గట్టిగానే చెబుతున్నారు. డిసెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీటితో పాటు వెంకీ – త్రివిక్రమ్ సినిమాపైనా అభిమానులు ఆశలు పెట్టుకొన్నారు. వేసవికి సరైన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న కాంబో. కాబట్టి ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా థియేటర్లు కళకళలాడడం ఖాయం.
ఈ సినిమాలు హిట్టవ్వడం ఆయా హీరోలకు, వాళ్ల అభిమానులకే కాదు. టాలీవుడ్ కి కూడా చాలా అవసరం. 2025లో కనిపించని హంగామా.. 2026లో చూడాలంటే.. ఈ సినిమాలు విజయతీరాలకు చేరాల్సిందే.
