బీహార్ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటి వరకూ చేసిన పరిశీలన ప్రకారం 35 లక్షలకుపైగా ఓటర్లను తొలగించనున్నారు. సవరణ ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకూ కొనసాగుతుంది. ఇప్పటి వరకూ సుమారు 35.5 లక్షల ఓటర్లు అసలు ఓటర్లు కాదని గుర్తించారు. 12.5 లక్షల మంది మరణించిన వారి పేర్లు, 17.5 లక్షల మంది బీహార్ నుంచి శాశ్వతంగా వలస వెళ్లినవారు, 5.5 లక్షల మంది రెండు చోట్ల నమోదైన ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. వీరి పేర్లను ప్రాసెస్ ప్రకారం తొలగిస్తారు.
గుర్తింపు పత్రాలను ఓటర్లు సమర్పించాల్సి ఉంది. ఇప్పటివరకు 6.6 కోట్ల మంది ఓటర్లు తమ పత్రాలు సమర్పించారు. పత్రాలు సమర్పించని వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండవు. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఓటర్లు తమ గుర్తింపు పత్రాలను సమర్పించేందుకు పలు మార్గాలు సూచించారు. వెబ్ సైట్, యాప్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి కి వెళ్లి వాటిని ధృవీకరిస్తున్నారు.
2003 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని సవరణ జరుగుతోంది. 2003 జాబితాలో పేరు ఉన్న 5 కోట్ల మంది ఓటర్లు కేవలం గణన ఫారమ్‌తో ఆ జాబితా సారాంశాన్ని సమర్పించాలి. మిగిలిన 2.9 కోట్ల మంది 11 రకాల పత్రాల్లో ఒకదాన్ని సమర్పించాలి . ఈ పరిశీలనపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరుగుతోంది. ఇదంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓటర్లను తొలగించే ప్రయత్నంగా ఆరోపిస్తున్నాయి. సీమాంచల్ ప్రాంతంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఈ ప్రక్రియ లక్ష్యంగా ఉందని చెబుతున్నారు.
బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. దానికి ఓడిపోయిన వారు చెప్పే కారణాల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చు.