ప్రకృతి సౌందర్యంతో అద్భుతంగా ఉండే పట్టణం విశాఖ. సముద్ర తీరం లో ఉండే ఈ పట్టణంలో స్క్రై స్క్రాపర్ల సంస్కృతికి ఇంకా ఊపందుకోలేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఎత్తు పెరిగిపోతున్న ఆపార్టుమెంట్ల లాంటివి విశాఖలోనూ రావాలి చాలా మంది కోరుకుంటున్నారు. కాస్త దూరంగా ఉన్నా.. స్కై స్కాపర్లలో ఉండేవారు సముద్ర తీరాన్ని ఆస్వాదించగలరు. అందుకే వీఎంఆర్డీఏ యాభై అంతస్తుల అపార్టుమెంట్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది.
విశాఖలో మంచి రెసిడెన్షియల్ ఏరియాగా పేరున్న మధురవాడలో ఒక్కోటియాభై అంతస్తులు ఉండేలా నాలుగు టవర్లను నిర్మించాలన్న నిర్ణయానికి వీఎంఆర్డీఏ వచ్చింది. అన్ని సౌకర్యాలతో ఉండేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. విశాఖకు మెట్రో లుక్ వచ్చేలా .. వీటి నిర్మాణం ఉండనుంది. విశాఖలో ఇప్పటికీ 30 అంతస్తుల కాంప్లెక్సులు కూడా లేవు. మారుతున్న కాలంతో పాటు మొత్తం రియల్ ఎస్టేట్ స్ట్రక్చర్ కూడా మార్చేలా వీఎంఆర్డీఏ ప్రయత్నాలు చేస్తోంది.
విశాఖకు పెద్ద ఎత్తున సాఫ్ట్ వేర్ కంపెనీలు వస్తున్నాయి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా చాలా కంపెనీలు క్యాంపస్ లు పెట్టబోతున్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలూ క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా అధిక ఆదాయ ఉద్యోగాలు విశాఖలో పెరిగే అవకాశాలు కనిపిస్తూండటంతో.. లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగనుంది. ఆ దిశగా అవకాశాల్ని అంది పుచ్చుకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ముందడుగు వేస్తున్నాయి.