అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను పన్నుల పేరుతో బెదిరిస్తున్నారు. ఇండియాను కూడా అలాగే బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. గత వారం 25 శాతం పన్నులేసినట్లుగా ప్రకటించిన ఆయన.. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మరో 25 శాతం పెంచారు. మొత్తం భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై 50 శాతంపన్ను విధించారు.
భారత్ లాంటి మిత్ర దేశాన్ని మూర్ఖత్వంతో దూరం చేసుకోవద్దని నిక్కీహేలి లాంటి వాళ్లు హెచ్చరిస్తున్నా ట్రంప్ వినడం లేదు. ఉక్రెయిన్ తో యుద్ధం చేయడానికి రష్యాకు భారతే డబ్బులిస్తోందని వితండవాదం చేస్తూ పన్నులు విధించారు. భారత్ కన్నా ఎక్కువగా చమురును రష్యా నుంచి చైనా దిగుమతి చేసుకుంటుంది. తాజా పన్ను విధింపుల వల్ల భారతీయ ఎగుమతులపై గట్టి ప్రభావం పడనుంది. మరో వైపు భారత్ అమెరికా బెదిరింపులకు తగ్గాలని అనుకోవడం లేదు.
రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు కొత్తగా చైనాతోనూ గతంలో ఉన్న దూరాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెలాఖరులో మోడీ.. చైనా పర్యటనకు వెళ్తున్నారు. భారత్ ను బెదిరించి ట్రేడ్ డీల్ చేయించుకుని నాన్ వెజ్ పాలు సహా భారత చిన్న తరహా పరిశ్రమలు, రైతులపై ప్రభావం పడే ఉత్పత్తులను డంప్ చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. కానీ స్వదేశీ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని భారత్ తేల్చి చెబుతోంది.