ఇదీ పరిస్థితి. సినిమా పోస్టర్లలో 50వ రోజు, 100వ రోజు ప్రత్యేకం మామూలే. కల్లోల కాశ్మీర్లో అశాంతి చెలరేగి 50 రోజులైంది. ఇన్ని రోజులుగా కర్ఫ్యూ నీడలోనే కాశ్మీరీలు మగ్గిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నం తాము చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కర్ఫ్యూ ఎత్తివేస్తే ఏం జరుగుతుందో అనే భయం ఇంకా వీడలేదు.
బుర్హాన్ వనీ అనే ఉగ్రవాది ఎన్ కౌంటర్ తర్వాత లోయలో అల్లర్లు చెలరేగాయి. లష్కరే తయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో పాటు, కాశ్మీర్లోని వేర్పాటు వాద శక్తులు పనిగట్టుకుని అల్లర్లు చేయించాయి. అల్లర్లు, భద్రతాదళాల కాల్పుల్లో ఇప్పటి వరకు 70 మంది మరణించారు. 11 వేల మందికి పైగా గాయపడ్డారు. కొందరు వేర్పాటు వాద నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. అయినా వాళ్లు యువకులను రెచ్చగొడుతూనే ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై దృష్టిపెట్టినా పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండు సార్లు కాశ్మీర్లో పర్యటించారు. పెల్లెట్ గన్స్ కు బదులు వేరేవి ఉపయోగిస్తామని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అందరూ సహకరించాలని కోరారు.
జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఏం చేయాలనే దానిపై చర్చించారు. తనకు ఓ అవకాశం ఇవ్వాలని వేర్పాటు వాద నాయకులను కోరారు. కాశ్మీర్లోని ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకు వేర్పాటు వాదులకు అనుకూలంగానే ఉంటాయి. లేకపోతే మనుగడ కష్టం. బీజేపీయేమో జాతీయ పార్టీ. అలా పీడీపీ, బీజేపీ పొత్తు భిన్నధ్రువాల కలయిక వంటిది. ఈ సంకీర్ణ ప్రభుత్వం కాశ్మీర్లో శాంతిని నెలకొల్పడంలో గత 50 రోజులుగా విఫలమవుతూనే ఉంది.
పాకిస్తాన్ అనుకూల శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించనంత వరకూ కాశ్మీర్లో శాంతి భద్రంగా ఉండే అవకాశం లేదు. వేర్పాటు వాదులు ఆడింది ఆటగా నడుస్తున్నా మెహబూబా ప్రభుత్వం అంతసీరియస్ గా పట్టించుకున్నట్టు లేదు. బీజేపీ వారు నిస్సహాయంగా చేతులు ముడుచుకుని కూర్చోవడం మినహా ఏమీ చేయలేక పోతున్నారు. అధికార వ్యామోహంతో విమర్శలను ఎదుర్కోవడం మినహా వాళ్లు చేస్తున్నది ఏమీ లేదనిపిస్తోంది. కాశ్మీర్ కు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మిగతా ప్రాంతాల నుంచి విమాన సర్వీసులూ తగ్గాయి. మరి పరిస్థితి ఎప్పుడు మారుతుందనేది ప్రస్తుతం జవాబు లేని ప్రశ్నే.