జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో పోటీకి వందల మంది నామినేషన్లు దాఖలు చేసినా చివరికి పోటీలో మిగిలింది మాత్రం 58 మందే. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించారు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు, చిన్న పార్టీల నుంచి భారీగా అభ్యర్థులు దాఖలు చేసినా, ఉపసంహరణలతో సంఖ్య తగ్గింది. ఎన్నికలు నవంబర్ 11న జరగనున్నాయి, ఓటు లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్లో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది ఎన్నికలబరిలో నిలబడ్డారు. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు.
వీరిలో సీరియస్గా ప్రచారం చేసేవారు మూడు ప్రధాన పార్టీలకు చెందినవారే. ఒక్క బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా లేరు. అయితే కొంత మంది మాత్రం సీరియస్ గా ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం వచ్చే నెల 9వ తేదీ వరకూ జరుగుతుంది. అన్ని పార్టీల అగ్రనేతలు రోడ్ షోలతో హోరెత్తించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర జిల్లాల క్యాడర్ ను కూడా రప్పించి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.