హైదరాబాద్ లో ఆకాశహర్మ్యాల నిర్మాణంలో డెవలపర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎత్తు పెంచుకుటూనే పోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో అత్యంత ఎత్తైన భవనం SAS క్రౌన్. ఇది 58 అంతస్తులు ఉంది. మొత్తంగా 772 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇప్పుడు దాన్ని మించిపోయే నిర్మాణం కోసం ఓ డెవలపర్ రెడీ అయ్యారు. అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఆ డెవలపర్‌కు ప్రభుత్వంలో కూడా పట్టు ఉండటంతో అనుమతులు ఖాయమనేని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతంలో ఉంది. కోకాపేట ఉన్నత స్థాయి రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది. 62 అంతస్తులు అంటే సుమారు 200 నుంచి 230 మీటర్ల ఎత్తు ఉండే అవకాశం ఉంది. ఇది పూర్తిగా లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ గా నిర్మిస్తారు. ఇటువంటి హై-రైజ్ ప్రాజెక్టులలో సాధారణంగా స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, రూఫ్‌టాప్ గార్డెన్స్, రీక్రియేషనల్ సౌకర్యాలు, ఎనర్జీ-ఎఫిషియెంట్ ఫసాడ్లు, రెయిన్వాటర్ హార్వెస్టింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం 270 కంటే ఎక్కువ హై-రైజ్ భవనాలు ఉన్నాయి . 100 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను హై రైజ్ అని పిలుస్తున్నారు. వీటిలో 142 స్కైస్క్రాపర్లు 150 మీటర్లకు పైగా ఎత్తుతో ఉన్నాయి. కోకాపేట, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు హై-రైజ్ నిర్మాణాలకు కేంద్రంగా మారుతున్నాయి, ఇక్కడ వచ్చే పదేళ్లలో దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన టవర్లు నిర్మితమవుతాయని రియల్ ఎస్టేట్ వర్గాలుర చెబుతున్నాయి.