మంత్రగత్తెగా ముద్ర- అమానుషంగా దాడి

వృద్ధురాలిపై మంత్రగత్తెగా ముద్రవేశారు. తమ ఇంట్లో అస్వస్థతకు ఈ ముసల్దే కారణమన్న మూఢవిశ్వాసం ముదిరిపోయింది. హఠాత్తుగా వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి చిత్రహింసలుపెట్టారు. ఆమెను మురుగుకాల్వలోకి త్రోసేశారు. అయినా ఆమె ధైర్యంగా పోలీసు స్టేషన్ గడపతొక్కింది. ఫిర్యాదుచేసింది. ఇలాంటి దాడులను నిలవరించడానికోసమే ఏర్పాటైన సరికొత్త చట్టం ఆమెకు అక్కరకు వస్తుందన్న గ్యారంటీ కనబడటంలేదు. కారణం, పోలీసులు ఈ చట్టం క్రింద ఇవ్వాళ్టివరకు కేసు పెట్టకపోవడమే. ఎఫ్ఐఆర్ లో తేలికశిక్షలు పడే సెక్షన్ల క్రింద కేసు నమోదుచేశారు. పైగా వృద్ధురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రభుత్వ ఉద్యోగి పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదు ! మరి ఈ వృద్ధ మహిళకు న్యాయం జరుగుతుందా? ఇదే ప్రజాస్వామ్య హితులను వేధిస్తున్న ప్రశ్న. ఇంతకీ ఈ సంఘటనఎక్కడ జరిగిందంటే…

85ఏళ్ల మహిళపై అనుమానం…

మంత్రగాళ్లున్నారనీ, వారు తమ క్షుద్రపూజలతో హానిచేస్తుంటారన్న నమ్మకం ఇంకా తొలిగిపోలేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మంత్రగత్తెలుగా, మంత్రగాళ్లుగా ముద్రపడినవారిపైదాడులకు పాల్పడటం ఇంకా కనబడుతున్న దృశ్యం. ఇప్పుడు తాజాగా, రాజస్థాన్ లో ఇలాంటి దాడి జరిగింది. 83ఏళ్ల మహిళను మంత్రగత్తెగా ముద్రవేసి ఆమెను కొట్టి, బండబూతులుతిట్టి, ఇల్లు కొల్లగొట్టి చివరకు మురికి కాల్వలోకి త్రోసేశారు. జైపూర్ కి 260 కిలోమీటర్ల దూరంలోని బిహారా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామం బిల్వారా జిల్లాలో ఉంది.

ఈ వృద్ధురాలి పేరు చాయూ భాయ్. ఆమెకు మంత్రశక్తులున్నాయనీ, క్షుద్రపూజలు చేస్తోందనీ, గిట్టనివారిపై మంత్రాలు ప్రయోగిస్తున్నదన్న అనుమానంతో కొంతమంది గ్రామస్థులు ఆమెపై దాడిచేశారు. చాయూ భాయ్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసేవరకు అసలు విషయం ఎక్కడా పొక్కలేదు. ఓ పదహారుమంది ఆమె ఇంటికెళ్ళి ఇనుపగొలుసలతో దాడికి దిగారు. వాళ్లింట్లో ఎవరో చాలాకాలంగా తీవ్ర అస్వస్థతగా ఉంటే, దానికి కారణం ఈ ముసల్దే అనుకున్నారు. దీంతో దాడికి దిగారు.

`మంత్రగత్తెన్న ముద్రవేసి నాపై దాడిచేసి ఆస్తిని కాజేయాలని చూశారు’- ఇదీ వృద్ధురాలి ఆరోపణ. దాడికి దిగినవారు ఇంట్లోకి జొరబడి ఆమె జుట్టుపట్టుకుని వరండాలోకి లాక్కొచ్చి చితక్కొట్టారు. అయినా కసిచల్లారక వీధిలోకి లాక్కునొచ్చి మురుగుకాలవలోకి తోసేశారు. ఇంతలో ఒకడు ఆమె నోట్లో బలవంతంగా సారాపోసి అసభ్యంగా మాట్లాడాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

గట్టి చట్టమే ఉంది, కానీ…

రాజస్థాన్ లో ఒక ప్రత్యేక చట్టం (The Rajasthan Prevention of Witch Hunting Act ) ఈ ఏడాదే అమల్లోకి వచ్చింది. మంత్రగత్తెగా ముద్రవేసి వారిపై దాడులకు దిగడం, తినకూడని వాటినీ, తాగకూడనివాటిని తినమనీ, తాగమని బలవంతపెట్టడం వంటి చర్యలను నిరోధించడానికే ప్రత్యేకంగా ఈ చట్టం రూపొందింది. అలాంటి అమానుష చర్యలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించే వీలు ఈ కొత్త చట్టం కలిపిస్తోంది. ఇంత కఠిన చట్టం అమల్లో ఉన్నా రాజస్థాన్ లో గత కొద్దినెలల్లోనే మంత్రగత్తెలన్నఅనుమానంతో వారిపై దాడులకు పాల్పడిన సంఘటనలు అనేకం జరిగాయి. ఒక్క భిల్వారా జిల్లాలోనే ఈమధ్యనే మూడురోజుల వ్యవధిలో మూడుకేసులు నమోదయ్యాయంటే మూఢనమ్మకాల ముసుగులో అమానుష దాడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థంచేసుకోవచ్చు. కొద్దిపాటి అనుమానం వస్తేచాలు, మంత్రగత్తె అన్న ముద్రవేయడం, దాడులకు దిగడం సర్వసాధారణమైపోయిందక్కడ. మూఢనమ్మకాలను వదిలిపెట్టాలనీ, మంత్రశక్తులు లేవనీ, క్షుద్రశక్తులున్నాయన్న భ్రమలో అమానుష దాడులకు దిగవద్దని చైతన్యం కలిగిస్తున్నా ఈ తరహా దాడులు తగ్గడంలేదు.

పోలీసులతో కుమ్మక్కయ్యారా?

ఈ తాజా సంఘటనలో దాడికి దిగినవారిపై కొత్త చట్టం క్రింద కేసులు బనాయించకుండా 323, 341సెక్షన్ల క్రింద కేసులు నమోదుచేయడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటం గమనార్హం. అందుకే కేసు తీవ్రతను తగ్గించారన్న గుసగుసలు వినబడుతున్నాయి. పోలీసులతో కుమ్మక్కై తమ పేర్లు పొక్కకుండా చూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

చాయూ భాయ్, ఆమె మనవరాలు కలిసి పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదులో, వ్యావసాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగి రతన్ లాల్ గుర్జార్ అతని భార్య హేమలత, ఇంకా భార్తి గుర్జార్, గీతా గుర్జార్, ముఖేష్ గుర్జార్ లను నిందితులుగా పేర్కొన్నది. అయితే పోలీస్ లు నమోదుచేసిన ఎఫ్.ఐఆర్ లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగి పేరు లేదు. అతని భార్య పేరుకూడా లేదు. ఎఫ్ఐఆర్ లో భార్తి గుర్జార్ పేరు మాత్రమే ఉంది. ఉద్దేశపూర్వకంగా గాయపరచడం (323 సెక్షన్), క్షణికోద్వేగంతో అనాలోచనతో శిక్షించడం(341 సెక్షన్)ల క్రిందమాత్రమే ఆ ఒక్క వ్యక్తిమీద కేసు నమోదైంది. పోలీసులు విచారణ ప్రారంభించారు.

కఠిన చట్టాలున్నప్పటికీ అవి బాధితులకు అండగా ఉండకుండా గొప్పోళ్ల జేబుబొమ్మలుగా మారిపాయాయన్నది ఈ సంఘటన మరోసారి రుజువుచేసింది. బాధితులు స్వయంగా ఫిర్యాదు చేసినా తేలికపాటి సెక్షెన్ల క్రింద కేసులు పెడుతున్నారన్న సంగతీ తేలిపోయింది. మూఢనమ్మకాలకు ఆనవాలమైన రాజస్థాన్ వంటి చోట్ల చట్టాలు కేవలం కాగితపు పులులుగా మారిపోయాని ప్రజాహిత సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. అందుకే వృద్ధురాలైన చాయూ భాయ్ దాడిసంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి ఇలాంటప్పుడు దాడికి దిగినవారికి కఠిన శిక్షలు పడతాయా? బాధితురాలికి ఊరట లభిస్తుందా??

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com