హైదరాబాద్: గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారిన ఉస్మానియా యూనివర్సిటీ బీఫ్ ఫెస్టివల్ విషయంలో హైకోర్ట్ ఇవాళ ఖచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించటానికి వీల్లేదని స్పష్టీకరించింది. ఈ విషయంలో సిటీ సివిల్ కోర్ట్ జారీచేసిన ఆదేశాలనే పాటించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించింది. సోమవారం సిటీ సివిల్ కోర్ట్ ఈ విషయంపై తీర్పు ఇస్తూ అనుమతి నిరాకరించటంతో, ఆ ఉత్తర్వులపై బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు హైకోర్ట్‌లో అప్పీల్ చేశారు.
మత అసహనం, గొడ్డు మాంసం తినేవారిపై దేశంలోని కొన్ని ప్రాంతాలలో దాడులు జరగటానికి నిరసనగా, ఎవరి ఇష్టమొచ్చిన ఆహారాన్ని వారు తినే హక్కు ప్రజలకు ఉందని తెలియజెప్పటంకోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న వివిధ సంఘాలవారు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని తలపెట్టారు. మరోవైపు కొన్ని హిందూ సంఘాల నాయకులు, ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా పందికూర పండగ చేస్తామని హెచ్చరించారు. దీనితో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ్టి హైకోర్ట్ ఉత్తర్వులతో ఆ పరిస్థితి తొలగిపోయినట్లయింది.