ఆ వైకాపా ఎమ్మెల్యేకి పొగ‌పెట్టిందెవ‌రు..?

పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి అనూహ్యంగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. త‌న ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ‌తీశారంటూ వైకాపా నాయ‌క‌త్వంపై ఆమె విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గ‌డ‌చిన మూడేళ్లుగా పార్టీ కోసం తాను చాలా క‌ష్ట‌ప‌డుతున్నాన‌నీ, పాడేరుతోపాటు అర‌కులోయ‌లో కూడా పార్టీని నిల‌బెట్టుకుంటూ వ‌చ్చాన‌నీ, కానీ త‌న ప‌ట్ల అధినాయ‌క‌త్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి ఆవేద‌న క‌లిగిస్తోందంటూ ఆమె విమ‌ర్శించారు. త‌న ఆత్మ‌విశ్వాసాన్ని జ‌గ‌న్‌, విజ‌య‌సాయి రెడ్డిలు దెబ్బ‌కొట్టారంటూ బ‌హిరంగానే ఆమె ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్న‌ట్టుగా కొన్ని మీడియాల్లో క‌థ‌నాలు వ‌చ్చేస్తున్నాయి. అయితే, ఇవ‌న్నీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆడుతున్న మైండ్ గేమ్ గా అన‌కాప‌ల్లి వైసీపీ ఎంపీ అమ‌ర్ నాథ్ కొట్టిపారేస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ల‌భిస్తున్న జ‌నాద‌ర‌ణ‌ను చూసి టీడీపీ ఓర్వ‌లేక, ఇలాంటి క‌థ‌నాలు రాయిస్తున్నారంటూ ఆయ‌న ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొన్ని స‌మ‌స్య‌ల్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈశ్వ‌రి ప్ర‌య‌త్నిస్తుంటే.. ఇంత రాద్దాంతం చేస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డ్డారు. ఇంత‌కీ.. ఈశ్వ‌రి అసంతృప్తి వెన‌క అసలు క‌థ వేరే ఉంది.

విశాఖ ఏజెన్సీలో వైకాపాకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు ఈశ్వ‌రి. అన్ని మండ‌లాల్లో క‌మిటీలు వేసి మ‌రీ పార్టీని స‌మీక్షిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆమె ఉన్నారు. అయితే, ఈ నేప‌థ్యంలో ఓ మాజీ మంత్రి వైకాపాలో చేరేందుకు చ‌క్రం తిప్పుతూ ఉండ‌టం, సీమ‌కు చెందిన ఓ ప్ర‌ముఖ నేత ద్వారా జ‌గ‌న్ తో మంత‌నాలు ఏడాదిన్నరగా సాగిస్తున్నారు. తాజాగా, ఎమ్మెల్యేతో స‌హా అరకులోయ‌కి చెందిన కొంత‌మంది నేత‌లు టీడీపీలో చేరారు. దీంతో పార్టీకి ఏర్ప‌డిన న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డం కోసం ఒక మాజీ మంత్రినీ, మాజీ శాస‌న స‌భ్యుడినీ చేర్చుకునేందుకు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఈ ఇద్ద‌రిలో ఒక‌రికి పాడేరు టిక్కెట్‌, మ‌రొక‌రికి అరకులోయ అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు కూడా పార్టీ అధినాయ‌క‌త్వం సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింద‌ట‌. ప్ర‌స్తుత పాడేరు ఎమ్మెల్యే ఈశ్వ‌రికి ఈ ప‌రిణామాలే రుచించ‌డం లేదు. ఎందుకంటే, ఈ క్ర‌మంలో ఆమె ఎమ్మెల్యే టిక్కెట్ గ‌ల్లంతైన‌ట్టే క‌దా. అయితే, అర‌కు ఎంపీ స్థానం నుంచి ఆమెని పోటీ చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌ను పార్టీ తీసుకొచ్చినా, ఆమెకు న‌చ్చ‌లేద‌ని స‌మాచారం.

పార్టీ కోసం మూడేళ్లుగా ఎంతో శ్రమిస్తుంటే.. త‌న ప్ర‌మేయం లేకుండా పార్టీలో నిర్ణ‌యాలు జ‌రిగిపోతున్నాయ‌నీ, జ‌గ‌నే స‌ర్వస్వం అని న‌మ్ముకుంటే, క‌నీసం త‌న అభిప్రాయాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా అరుకులో పార్టీ స‌మావేశం నిర్వ‌హించేశార‌ని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఇదీ అస‌లు క‌థ‌. ఇప్పుడు ఆమె బ‌య‌ట‌పెడుతున్న ఆవేద‌న వెన‌క చోటు చేసుకున్న ప‌రిణామాలు ఇన్ని ఉన్నాయి. అంతేగానీ, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ చూసి, ఓర్వ‌లేక టీడీపీ మొద‌లుపెట్టిన మైండ్ గేమ్ ఇదీ అని వైకాపా నేత‌లు ఆరోపించ‌డం స‌రైంది కాదు. ఆమె ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నార‌నేది ఓ వ‌ర్గం మీడియా అత్యుత్సాహం అనొచ్చు. జ‌గ‌న్ తోపాటు, విజ‌య‌సాయిరెడ్డి కూడా ఇప్పుడు రంగంలోకి దిగి ఈశ్వ‌రితో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. పార్టీలో న్యాయం జ‌రుగుతుంద‌ని భరోసా ఇస్తున్నార‌ట‌. చిత్రం ఏంటంటే… ఆమె ప్ర‌మేయం లేకుండా ఆమె సొంత నియోజ‌క వ‌ర్గంలో మార్పులూ చేర్పులూ జ‌రుగుతున్న‌ప్పుడే, ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌నే అంచ‌నా పార్టీ అధినాయ‌క‌త్వానికి ముందుగా ఉండ‌దా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.