ఇవాళ మళ్ళీ జనం లోకి రానున్నాడు జన సేనాని పవన్ కళ్యాణ్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు మురళి కుటుంబ సభ్యులను, కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆ సంస్థ ఉద్యోగి వెంకటేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా పవన్ తనని అంతర్మధనానికి గురిచేసిన ఒక విషయాన్ని పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే-
“ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ ప్రశ్న నన్ను అంతర్మథనంలో పడేసింది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ఆ విద్యార్థి ప్రస్తావించాడు. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తెదేపాకు మద్దతుగా ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినందున మీరు కూడా బాధ్యులు కాదా?’’ అని విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆలోచిస్తే ఆ ప్రశ్నలో సహేతుకత ఉందనిపించింది. అందువల్ల ఆ పడవ ప్రమాదం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేశ్ ఆత్మహత్య ఉదంతంలో నా వంతు బాధ్యత కూడా ఉందని అంగీకరిస్తున్నా.”
అలాగే ఈ సందర్భంగా యువత నిరాశకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. విలువైన ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దు. పోరాడండి. సాధించండి. నాతో పాటు జనసేన కూడా అండగా ఉంటుంది అని పవన్ అన్నారు.