అమితాబ్ బచ్చన్ ఎక్కడ? మనం ఎక్కడ? అయన ట్విట్టర్లో మనల్ని ఫాలో కావడం ఏంటి? ఇది కల కాదుగా? చాలామంది తెలుగు సినిమా ప్రముఖుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.
హీరోలు అల్లు అర్జున్, అక్కినేని నాగ చైతన్య, అఖిల్, నందమూరి కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, సందీప్ కిషన్, అల్లరి నరేష్, మంచు మనోజ్… హీరోయిన్లు కాజల్, తమన్నా, రకుల్, అనుపమా పరమేశ్వరన్, మెహరీన్, లావణ్యా త్రిపాఠి, ప్రణీత, రెజినా… దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి… కమెడియన్ వెన్నెల కిషోర్… రైటర్స్ కోన వెంకట్, గోపిమోహన్… లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తదితరులను ట్విట్టర్లో అమితాబ్ బచ్చన్ ఫాలో అవుతున్నారిప్పుడు.
రెండు మూడు రోజుల క్రితం వరకు వీళ్లను ఆయన ఫాలో కాలేదు. ఇటీవల అమితాబ్ ఫాలోయర్స్ సంఖ్యను ట్విట్టర్ కావాలని తగ్గించిందని స్వయంగా బిగ్ బి ట్విట్టర్లో ఆరోపించారు. ఆ తర్వాత తెలుగు సినిమా ప్రముఖులను ఆయన ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. అమితాబ్ అంతటి సూపర్ స్టార్ తమను ఫాలో కావడం సంతోషంగా ఉన్నప్పటికీ, అసలు ఏం జరుగుతోంది? అనే సందేహం చాలామందిలో ఉంది. కొందరు మాత్రం తమ సంతోషాన్ని ట్విట్టర్లో పంచుకుంటున్నారు.