అనుకున్నట్టుగానే ఎన్డీయే నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైదొలిగింది. ఆంధ్రా ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోని నేపథ్యంలో.. ఇప్పటికే కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి రాజీనామాలు చేశారు. కానీ, కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో ఎన్డీయే నుంచి కూడా బయటకి వచ్చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఈరోజు ఉదయమే పోలిట్ బ్యూరో సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో కూడా మాట్లాడి, ఎన్డీయేతో తెగతెంపుల విషయమై చెప్పారు. ఇదే విషయాన్ని లేఖ ద్వారా ఎన్డీయే వర్గానికి, భాజపా జాతీయ అధ్యక్షుడికీ విషయాన్ని తెలియజేయబోతున్నట్టు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఢిల్లీలో చెప్పారు.
దీంతోపాటు మరో కీలక నిర్ణయం కూడా టీడీపీ తీసుకుంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే ప్రతిపక్షం వైకాపా కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వైకాపా ఇచ్చిన నోటీసుల్లో ఐదు సంతకాలు మాత్రమే ఉన్నాయనీ, అదే టీడీపీ నోటీసులు ఇస్తే 13 మంది సంతకాలుంటాయని చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రవేశపెట్టిన తీర్మానానికి తాము ఎందుకు మద్దతు ఇవ్వడం లేదనే విషయాన్ని కూడా వివరణ ఇచ్చారు. వైసీపీకి మద్దతు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనీ, అందుకే టీడీపీ ప్రత్యేకంగా నోటీసులు ఇస్తుందని చంద్రబాబు అన్నారు.
ఇక, ఇదే అంశమై ఢిల్లీలో ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ… మొత్తం 54 మంది ఎంపీల మద్దతును తాము సేకరిస్తామనీ, అలా చేస్తేనే అవిశ్వాస తీర్మానానికి విలువ ఉంటుందన్నారు. వైకాపా తీర్మానం పెట్టినా దానికి ప్రాధాన్యత ఉండదన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో మీడియాకి చిక్కారనీ, అలాంటప్పుడు వారు పెడుతున్న అవిశ్వాసంపై తమకు నమ్మకం లేదనీ, అందుకే తాము స్వయంగా తీర్మానం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు సీఎం రమేష్ చెప్పారు.
రెండు కీలక నిర్ణయాలను టీడీపీ త్వరత్వరగా తీసేసుకుంది. నిజానికి, వైకాపా తీర్మానానికే మద్దతు ఇవ్వాలనే అభిప్రాయం నిన్న టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమైంది. కానీ, అదే జరిగితే రాజకీయంగా ఆంధ్రాలో వైకాపాకి కలిసొచ్చే అంశమౌతుంది. అలాగని, మద్దతు ఇవ్వకుండా ఉంటే ఏపీ ప్రయోజనాల విషయమై టీడీపీ చిత్తశుద్ధి ఇదేనా అని వైకాపా విమర్శిస్తుంది. పోనీ, టీడీపీ స్వయంగా అవిశ్వాసం పెడదామనుకుంటే.. ఎన్డీయేతో బంధం కొనసాగుతోంది..! సో.. వీటన్నింటికీ ఒకే నిర్ణయంతో చెక్ పెట్టేశారు. ఎన్డీయేతో తెగతెంపులు ప్రకటించేసి.. వెంటనే అవిశ్వాసం కూడా తామే ప్రవేశపెడుతున్నట్టు చంద్రబాబు నిర్ణయించారు. వైకాపా అవిశ్వాసానికి తాము ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి, తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ కూడా త్వరత్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది..!