ఇంతకాలం జనసేన గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడని అల్లు అర్జున్ తొలిసారి నోరు విప్పాడు. ఈ పార్టీ గురించి మాట్లాడాడు. ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన ప్రస్తావన వచ్చింది. ”చరణ్, సాయిధరమ్.. వీళ్లంతా జనసేనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మీరెప్పుడూ స్పందించలేదెందుకు?” అని అడిగితే.. చాలా తెలివైన సమాధానం చెప్పాడు. ”ప్రస్తుతం పొలిటికల్‌గా ఓ స్టాండ్ తీసుకోవాలంటే నాకు ముందు చిరంజీవిగారి స్టాండ్ ఏంటో తెలియాలి. ఆయన ప్రస్తుతం క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో మళ్లీ యాక్టివ్ అవుతారేమో. ఆయన ఏ పార్టీ వైపు నడిస్తే.. నేనూ ఆ పార్టీ వైపే నడుస్తా. ఆయన జనసేనకు మద్దతు ఇస్తే నేనూ ఇస్తా” అంటూ.. బంతిని చిరంజీవి కోర్టులో వేసేశాడు. ఫ్యాన్స్ మధ్య విబేధాలు, గ్రూపుల గురించి కూడా బన్నీ తొలిసారి స్పందించాడు. మెగా కాంపౌండ్ చాలా పెద్దదని, చాలామంది హీరోలున్నారని, ఎవరికి తగిన ఫాలోయింగ్ వాళ్లకు ఉందని, అలాంటప్పుడు ఫ్యాన్స్ మధ్య చిన్న చిన్న గొడవలు తప్పవని ఒప్పుకున్నాడు బన్నీ. అయితే “అవన్నీ తాత్కాలికం.. వాళ్లు కూడా కలిసిపోతారు.. బయట ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారన్నది కాదు, మేం ఎలా ఉన్నాం అనేదే ప్రధానం“ అని క్లారిటీ ఇచ్చాడు.