ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రను పుణె పోలీసులు బయటపెట్టడం సంచలనమైంది. భీమా కోరేగావ్ ఘటన జరిగినప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఐదుగురిని అరెస్టు చేసిన సందర్భంలో వారి దగ్గర ఒక లేఖ బయటపడిందని సమాచారం. జాకబ్ విల్సన్ ఇంట్లో సోదాలు చేస్తుండగా ఈ లేఖ దొరికినట్టు చెబుతున్నారు. రాజీవ్ గాంధీని ఎల్.టి.టి.ఇ. ఎలా హత్య చేసిందో, అదే తరహాలోనే మోడీని హతమార్చాలనే ప్రణాళిక సదరు లేఖలో ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ప్లాన్ అమలు చేయడం కోసం ఎమ్ ఫోర్ రైఫిల్స్ కొనడానికి రూ. 8 కోట్లు అవసరం అవుతాయని కూడా లేఖలో పేర్కొన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇది మోడీ కోసం చేస్తున్న కుట్రగానే నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరో సంచలనం ఏంటంటే… ఈ లేఖలో వరవరరావు పేరు ఉండటం! ఈ ప్లాన్ అమలు చేసేందుకు అవసరమైన సొమ్మును ఆయనే సమకూర్చుతారని సదరు లేఖలో పేర్కొన్నారట. దీంతో నిందితుడు వరవరరావును కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. పుణె పోలీసులు హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. అయితే, తనకూ ఈ లేఖలకూ ఎలాంటి సంబంధం లేదని వరవరరావు అంటున్నారు. నిజానికి, హింసా విధానాలు మావోయిస్టులు ప్రవృతి కాదని ఆయన అంటున్నారు. ఇలా హత్యలు చేయడం తమ సిద్ధాంతం కాదనీ, సామాజిక పోరాటమే తాము చేస్తామని ఆయన అభిప్రాయడ్డారు.
అయితే, ఈ లేఖపై కాంగ్రెస్ పార్టీ స్పందన మరోలా ఉంది. మోడీ ప్రభ తగ్గుతోంది కాబట్టి, భాజపాకి ఆదరణ పడిపోతున్న ఈ తరుణం ఇలాంటి లేఖలు బయటకి వస్తాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది కేవలం జిమ్మిక్కు మాత్రమే అని అంటున్నారు. ఈ లేఖపై సమగ్ర విచారణ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ లేఖని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సీరియస్ గానే తీసుకున్నాయి. జాకబ్ విల్సన్ ను మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఈ లేఖలో, మోడీ రోడ్ షోలను లక్ష్యంగా చేసుకుని దాడి చెయ్యాలనీ, దీని కోసం నాలుగు లక్షల రౌండ్లు బుల్లెట్స్ అవసరముంటాయని హైకమాండ్ కు లేఖ రాసినట్టు పోలీసులు అంటున్నారు. మొత్తానికి, ఇప్పుడీ లేఖ సంచలనం అవుతోంది.