స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్‌గా చేస్తూ… తనకు సూటయ్యే కథలు వచ్చినప్పుడు మాత్రమే హీరోగా యాక్ట్ చేస్తూ… కెరీర్లో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా, లౌక్యంగా అడుగులు వేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి. హీరోగా నటించిన తాజా సినిమా విడుదల విషయంలోనూ లౌక్యంగా వ్యవహరించాడు. ఈ స్టార్ కమెడియన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘జంబ లకిడి పంబ’. ముందు ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే… అదే రోజున నందమూరి కల్యాణ్‌రామ్ ‘నా నువ్వే’ విడుదలవుతోంది. మరుసటి రోజున సుధీర్ బాబు ‘సమ్మోహనం’ వస్తుంది. ఇద్దరు హీరోలతో శ్రీనివాసరెడ్డికి సత్సంబంధాలు వున్నాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి శ్రీనివాసరెడ్డి క్లోజ్. నందమూరి కల్యాణ్‌రామ్‌తోనూ క్లోజ్ రిలేషన్ వుంది. ‘పటాస్’లో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. అందుకని, కల్యాణ్‌రామ్ సినిమా విడుదల రోజున తన సినిమాను విడుదల చేయకూడదని అనుకున్నాడో… మరొకటో… ‘జంబ లకిడి పంబ’ విడుదలను వాయిదా వేశాడు. ఓ అడుగు వెనక్కి వేసి వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబ లకిడి పంబ’ కామెడీ క్లాసిక్‌గా నిలిచింది. అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అని యూనిట్ చెబుతోంది.